యుద్ధానికి సిద్ధమే.. తామేమీ చూస్తూ ఊరుకోం

22 Jun, 2019 14:26 IST|Sakshi

అమెరికాకు ఇరాన్‌ కౌంటర్‌

టెహ్రాన్‌: అగ్రరాజ్యం అమెరికా తమపై దాడిచేస్తే.. తామేమీ చూస్తూ ఊరుకోమని ఇరాన్‌ స్పష్టం చేసింది. తమదేశ సరిహద్దులోకి  ఏం దేశం ప్రవేశించినా.. తగిన సమాధానం చెపుతామని ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి అబ్బాస్‌ మౌసవీ హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌పై ఎలాంటి ప్రతిఘటనలు అనుమతించేదిలేదని గట్టిగా చెప్పారు. కాగా గతకొంత కాలంగా అమెరికా-ఇరాన్‌ మధ్య ప్రచ్చన్న యుద్ధం సాగుతోన్న విషయం తెలిసిందే. ఇరాన్‌ ప్రవేశపెట్టిన అణ్వయుధాల నిషేధం ఒప్పంద నుంచి అమెరికా బయటకు రావడంతో ఆ రెండు  దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షిణించాయి.

తాజాగా గల్ఫ్‌లో రెండు నౌకలపై దాడులు వారి మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌ భూభాగంలోకి ప్రవేశించిన అమెరికా నిఘా డ్రోన్‌ని ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డులు కూల్చివేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. యుద్ధానికి తాము ఎప్పుడూ సిద్ధమేనంటూ ఇరాన్‌ రివల్యూషనరీ గార్డు కవ్వింపు చర్యలకి దిగేసరికి డ్రోన్‌ కూల్చేసి ఇరాన్‌ అతి పెద్ద తప్పు చేసిందంటూ ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. ఇరాన్‌పై కఠినాత్మకంగా వ్యవహరించాలని భావించిన ట్రంప్‌.. ఆదేశంపై దాడి చేయాలని నిర్ణయించారు.

ఇరాన్‌లోని ఎంపిక చేసిన మూడు లక్ష్యాలపై అంతా సిద్ధం చేసినప్పటికీ, దాడి చేస్తే 150 మంది చనిపోతారని తెలియడంతో ట్రంప్‌ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. డ్రోన్‌ను కూల్చేసినందుకు అంత మందిని చంపడం భావ్యం కాదని తాను దాడి ఆలోచనను విరమించుకున్నట్లు ట్రంప్‌ చెప్పారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఇరాన్‌.. దాడికి తాముకూడా సిద్ధంగా ఉన్నామంటూ సమాధానమిచ్చింది. 

మరిన్ని వార్తలు