ఈసారి ఇరాన్‌ వంతు..బ్రిటన్‌ నౌక అడ్డగింత

11 Jul, 2019 18:03 IST|Sakshi

లండన్‌ : పర్షియన్‌ గల్ఫ్‌ ప్రాంతంలో బ్రిటన్‌కు చెందిన చమురునౌకను ఇరాన్‌ నావికా దళాలు స్వాధీనం చేసుకోవాలని చూడటంతో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. హేర్ముజ్‌ జలసంధిని దాటే సమయంలో ఇరాన్‌కు చెందిన మూడు నౌకలు తమ నౌకను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించాయని బ్రిటన్‌ ఇరాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్రిటన్‌ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ ఇరానియన్‌ ఇస్లామిక్‌ రెవెల్యూషనరీ గార్డ్స్‌ మూడు నౌకలలో వచ్చి బ్రిటిష్‌నౌకను ఇరాన్‌ తీర జలాల్లోకి మళ్లించాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. అయితే ఈ ప్రాంతంలో  గస్తీ కాస్తున్న బ్రిటిష్‌ యుద్ధ నౌక వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఇరాన్‌ దళాలను హెచ్చరించడంతో వెనక్కుమళ్లాయని పేర్కొన్నారు.  ఈ చర్యతో ఇరాన్‌ అంతర్జాతీయ ఒప్పందాలను హద్దుమీరిందని, వాణిజ్య ప్రాంతంలో సంచరిస్తున్న నౌకను స్వాధీనం చేసుకోవాలని చూడటం నిజంగా దుస్సాహసమేనని మండిపడ్డారు.

గత వారం సిరియాకు అనుమానస్పదంగా చమురు తీసుకుపోతున్న ఓ నౌకను బ్రిటిష్‌ రాయల్‌నేవీ జీబ్రాల్టర్‌ జలసంధిలో పట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ నౌక తమదేనని, వెంటనే విడుదల చేయాలని ఇరాన్‌ డిమాండ్‌ చేసింది. ఇరాన్‌ అధ్యక్షుడు  హాసన్‌ రౌహానీ సైతం ఈ సంఘటనపై ఘాటుగానే స్పందించారు. తదుపరి పరిణామాలను ఎదుర్కోవడానికి బ్రిటన్‌ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.  దీనికి ప్రతిగానే తాజాగా ఇరాన్‌ బ్రిటన్‌ చమురు నౌకను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించిందని పరిశీలకులు అంటున్నారు. అయితే ఇరాన్‌ భద్రతా దళాలు ఈ ఆరోపణలను ఖండించాయి. 

ఈ సంఘటనతో అప్రమత్తమైన అమెరికా, పర్షియన్‌ గల్ఫ్‌ ప్రాంతంలో మరింత భద్రతను పెంచాలని నిర్ణయించుకుంది. తమ మిత్ర దేశాలతో కలసి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తామని ప్రకటించింది. డొనాల్డ్‌ ట్రంప్‌ త్వరలో ఇరాన్‌పై ఆంక్షలు గణనీయంగా పెంచుతామని ట్వీట్‌ చేశారు. 2015లో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కాదని తన యురేనియం నిల్వలను పెంచుకోవడానికి ఇరాన్‌ ప్రయత్నించడంతో పాశ్చాత్య దేశాలకు, ఇరాన్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందనే విషయం తెలిసిందే. ఇప్పుడీ తాజా పరిణామంతో పరిస్థితి ఎటువెళ్తుందోనని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
 

మరిన్ని వార్తలు