అగ్రరాజ్య ఆంక్షలపై ఇరాన్‌ ఫైర్‌

1 Apr, 2020 16:37 IST|Sakshi

దుబాయ్‌ : కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో తమపై ఆంక్షలు ఎత్తివేసే చారిత్రక అవకాశాన్ని అమెరికా చేజార్చుకుందని ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రహాని అన్నారు. మహమ్మారిపై తమ పోరాటానికి అమెరికా చర్యలు అవరోధం కాదని స్పష్టం చేశారు. ఇరాన్‌ సహా ఇతర దేశాలు కరోనా వైరస్‌పై పోరాడే క్రమంలో వాటిపై ఆంక్షలను ఎత్తివేసే అవకాశం ఉందని, దీనిపై ఇంకా నిర్ధిష్టంగా నిర్ణయం తీసుకోలేదని అమెరికా విదేశాంగ సహాయ మంత్రి మైక్‌ పాంపియో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఆంక్షలను ఎత్తివేసే మంచి అవకాశాన్ని అమెరికా కోల్పోయిందని ఇరాన్‌ అధ్యక్షుడు వ్యాఖ్యానించారు.

అమెరికా తన పొరపాటుకు క్షమాపణలు చెబుతూ ఇరాన్‌పై అన్యాయంగా, అక్రమంగా విధించిన ఆంక్షలను తొలగించేందుకు ఇది మంచి అవకాశమని అన్నారు. ఈ అవకాశాన్ని అమెరికా వినియోగించుకుని ఇరాన్‌కు తాము వ్యతిరేకం కాదని వెల్లడించాలని అన్నారు. ​కరోనా వైరస్‌ను నిరోధించేందుకు తాము సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్నామని, ఈ మహమ్మారిపై పోరులో ఇతర దేశాల కంటే విజయవంతంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు.

కాగా, కరోనా మహమ్మారి ఇరాన్‌లో 2898 మందిని పొట్టనపెట్టుకోగా, 44,606 కేసులు నమోదయ్యాయి. మధ్యప్రాచ్యంలో అత్యధిక కేసులు నమోదైన ఇరాన్‌పై ఆంక్షలను తొలగించాలని చైనా, ఐక్యరాజ్యసమితి ఇప్పటికే అమెరికాను కోరాయి. 2015లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి బయటకు వచ్చి ఆ దేశంపై తిరిగి ఆంక్షలను విధించడంతో​ ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అమెరికా ఆంక్షలతో ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది.

చదవండి : కరోనా: 300 మందిని బలిగొన్న విష ప్రచారం

>
మరిన్ని వార్తలు