నెత్తురోడుతున్న ఇరాక్

18 Jun, 2014 00:38 IST|Sakshi
నెత్తురోడుతున్న ఇరాక్

* బాగ్దాద్ చేరువలో రెబల్స్ ఇరాక్ సార్వభౌమత్వం
* తీవ్ర ప్రమాదంలో ఉందన్న ఐరాస
* సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న ప్రజలు
* తిక్రిత్, మోసుల్ నగరాల్లో చిక్కుకుపోయిన భారతీయులు

 
 బాగ్దాద్: ఇరాక్ నెత్తురోడుతోంది. భద్రత బలగాలను, ప్రభుత్వ మద్దతుదారులను ఊచకోత కోస్తూ జీహాదీ తిరుగుబాటుదారులు బాగ్దాద్ దిశగా దూసుకెళ్తున్నారు. పలు ప్రాంతాల్లో జీహాదీలు, ప్రభుత్వ భద్రతాబలగాల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఇందులో తమదే పైచేయంటూ ఇరు వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే, ‘ఇరాక్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత తీవ్ర ప్రమాదంలో ఉన్నాయ’న్న ఇరాక్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి నికోలాయ్ మ్లదెనోవ్ మంగళవారం చేసిన ప్రకటన సున్నీ తిరుగుబాటుదారులైన ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ది లెవాంట్(ఐఎస్‌ఐఎల్)’ దళాల ఆధిక్యతను చెప్పకనే చెబుతోంది.
 
 రాజధాని బాగ్దాద్‌కు 60 కి.మీ.ల చేరువకు చేరుకున్నామని, బాగ్దాద్‌తో పాటు, షియాల పవిత్రనగరం కర్బలాను త్వరలో స్వాధీనం చేసుకుంటామని తిరుగుబాటుదారులు చెబుతుండగా.. వారిని సమర్థంగా ఎదుర్కొంటున్నామని, గతంలో జీహాదీలు స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను కూడా తిరిగి తమ అధీనంలోకి తీసుకున్నామని ప్రభుత్వ దళాలు ప్రకటిస్తున్నాయి. అయితే, ఇప్పటికే తిక్రిత్, మోసుల్‌ను స్వాధీనం చేసుకున్న ఐఎస్‌ఐఎల్ జీహాదీలు.. బాగ్దాద్‌కు ఉత్తరంగా అనేక ప్రాంతాలపై పట్టు బిగించాయి. షియాలు మెజారిటీగా ఉన్న కిర్కుక్ నగరాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాయి.
 
 బాగ్దాద్‌కు దగ్గర్లో ఉన్న బాకుబాను, షియాల ప్రాబల్యం అధికంగా ఉన్న తల్ అఫార్ పట్టణంలో అత్యధిక భాగాన్ని జీహాదీలు అధీనంలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తిరుగుబాటుదారుల బాగ్దాద్ ముట్టడిని ఇరాక్ ప్రభుత్వ భద్రతాదళాలు నిలువరించలేవని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, బఖుబా నుంచి తిరుగుబాటుదారులను తరిమేశామని భద్రతాదళాలు తెలిపాయి. ఇరువర్గాల పోరులో తిరుగుబాటుదారులు, భద్రతాదళాలతో పాటు 50 మందివరకు పౌరులు మరణించారని ప్రభుత్వాధికారి ఒకరు వెల్లడించారు. తిరుగుబాటు కారణంగా వేలాదిగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. కాగా, సున్నీ తిరుగుబాటుదారులకు సౌదీ అరేబియా మద్దతిస్తోందంటూ ఇరాక్ మంగళవారం ఆరోపించింది. ఇరాక్‌లోని షియాల ప్రభుత్వం సున్నీల పట్ల వివక్షాపూరితంగా వ్యవహరించిందని, అందుకే ఈ తిరుగుబాటని సున్నీల రాజ్యమైన సౌదీ అరేబియా ప్రకటించిన మర్నాడే ఇరాక్ ఈ ఆరోపణలు చేసింది.
 
 ఒబామా సమాలోచనలు
ఇరాక్ పరిస్థితిపై జాతీయ భద్రతకు సంబంధించిన ఉన్నతస్థాయి సలహాదారులతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మంగళవారం చర్చలు జరిపారు. తిరుగుబాటుదారులపై వైమానిక దాడులు చేయాలనే విషయంపై అమెరికా తర్జనభర్జనలు పడుతోంది. బాగ్దాద్‌లోని తమ ఎంబసీ, అక్కడి అమెరికన్ల భద్రత కోసం 275 మంది సైనిక సిబ్బందిని ఇరాక్‌కు పంపించింది. ఇరాక్‌కు మద్దతుగా ఇరాన్‌తో కలసి సైనిక చర్య చేపట్టే విషయాన్ని యూఎస్ తోసిపుచ్చింది. కానీ ఇరాన్‌తో ఇరాక్ పరిస్థితిపై వియెన్నాలో చర్చలు జరిపింది. మరోవైపు, పలు దేశాలు తమ దౌత్య సిబ్బందిని వెనక్కు పిలిపించుకుంటున్నాయి.
 
 కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన భారత్
 న్యూఢిల్లీ: ఇరాక్‌లోని భారతీయుల భద్రత కోసం న్యూఢిల్లీలో ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. అక్కడివారి సమాచారం కోసం +91 11 23012113, +91 11 23014104 నంబర్లలో సంప్రదించవచ్చని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇరాక్‌లో దాదాపు 10 వేలమంది భారతీయులున్నారు. తిక్రిత్‌లో కేరళకు చెందిన 46 మంది నర్సులు, మోసుల్‌లో మరో 40 మంది భారతీయులు చిక్కుకుపోయారు. ఈ రెండు నగరాలు తిరుగుబాటుదారుల అధీనంలోనే ఉన్నాయి. భారత ప్రభుత్వ అభ్యర్థనపై అంతర్జాతీయ రెడ్ క్రెసెంట్ సంస్థ సభ్యులు తిక్రిత్‌లోని భారతీయ నర్సులతో మాట్లాడారు. వారు క్షేమంగానే ఉన్నారని నిర్ధారించారు. ఆ నగరాల నుంచి వారిని తరలించేందుకు పరిస్థితులు అనుకూలంగా లేవని తెలుస్తోంది.
 
 అలాగే, ఇరాక్‌లోని హింసాయుత ప్రాంతాల్లో చిక్కుకునిపోయిన భారతీయులను రక్షించేందుకు ఇరాకీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పనిచేసే విషయంలో సాధ్యాసాధ్యాలను భారత్ ఆలోచిస్తోంది. విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ ఆదేశాల మేరకు అధికారులు అత్యవసరంగా సమావేశమై ఈ విషయంపై చర్చించారు. ఇరాక్ పరిస్థితిని సుష్మాస్వరాజ్ స్వయంగా సమీక్షిస్తున్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. బాగ్దాద్‌లోని భారత దౌత్యకార్యాలయం ఇరాక్ ప్రభుత్వంతో సంప్రదింపుల్లో ఉందన్నారు.
 
 ఎందుకీ సంక్షోభం..
ఇరాక్‌లో 97% ముస్లింలున్నారు. వారిలో 60% - 65% అరబ్ షియాలుంటారు. 15 నుంచి 20 శాతం అరబ్ సున్నీలుంటారు. దాదాపు 17% కుర్దులుంటారు. ఇరాక్‌లోని కుర్దుల్లోనూ సున్నీలే అత్యధికులు. ఇరాక్‌లో షియాలు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉండగా, సున్నీలు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. దేశ ఉత్తరప్రాంతంలో కేంద్రీకృతమైన కుర్దులు ప్రస్తుత తిరుగుబాటులో పాలుపంచుకుంటున్నారు.
 
  సద్దాంహుస్సేన్ పాలన అనంతరం అమెరికా కనుసన్నల్లో నూరి అల్ మాలికి ప్రధానమంత్రిగా బలహీనమైన షియా అనుకూల ప్రభుత్వం ఇరాక్‌లో ఏర్పడింది. ఆ ప్రభుత్వం మైనారిటీలైన సున్నీలు, కుర్దుల పట్ల నిర్దయగా, వివక్షాపూరితంగా వ్యవహరించడం ప్రారంభించింది. దాంతో వారిలో అసంతృప్తి పెరిగి, తిరుగుబాటుకు దారితీసింది. వారితో సద్దాంహుస్సేన్ ప్రభుత్వంలోని ఆర్మీ అధికారులు, పక్కదేశం సిరియాలోని తిరుగుబాటుదారులు జతకలిశారు. దాంతో ఇరాక్ మున్నెన్నడూ లేని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

మరిన్ని వార్తలు