33 ఏళ్ల తర్వాత బీచ్ కనిపించింది!

9 May, 2017 12:08 IST|Sakshi
33 ఏళ్ల తర్వాత బీచ్ కనిపించింది!

ఐర్లాండ్‌: కాలగర్భంలో కలిసిసోయిందనుకున్న ఓ బీచ్ 33 ఏళ్ల తర్వాత మళ్లీ కనిపించింది. అదేంటి బీచ్ తప్పిపోయిందా అని షాకవుతున్నారు కదూ.. సాధారణంగా మనుషులు, జంతువులు, పక్షులు ఇలా తప్పిపోవడం మళ్లీ కొన్ని రోజులకో, సంవత్సరాలకో మళ్లీ కనిపించడంతో మనం ఆశ్చర్యపోతుంటాం. అయితే ఐర్లాండ్‌లో 1984లో కనుమరుగైన బీచ్‌ 33 ఏళ్ల తర్వాత కనువిందు చేస్తోంది. పశ్చిమ ఐర్లాండ్‌లోని స్థానిక దూగ్ ఏరియాలో అచిల్ ద్వీపంలో మొత్తం ఆరు బీచ్‌లు ఉండేవి. అయితే 33 ఏళ్ల కిందట వరదలు, తుపానులు రావడంతో ఓ బీచ్ అట్లాంటిక్ మహా సముద్రంలో కలిసిపోయింది.

బీచ్‌ తీరంలోని ఇసుక సముద్రంలోకి కొట్టుకుపోవడంతో రాళ్లు మాత్రమే ఇక్కడ మిగిలిపోయి రెండూ ఏకమయ్యామని స్థానికులు చెబుతున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు తీరానికి ఇసుక కొట్టుకవచ్చి సముద్రం, బీచ్‌ వేరు పడ్డాయి. ఈ బీచ్‌ను చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. ఐర్లాండ్ లో అచిలీద్వీపమే అతిపెద్దదని అచిల్ పర్యాటకశాఖ అధికారి సీన్ మోల్లాయ్ తెలిపారు. ఈ ప్రసిద్ధ బీచ్‌లో నాలుగు హోటళ్లు అధిక సంఖ్యలో అతిథిగృహాలు ఉన్నాయని చెప్పారు. ఇదివరకూ ఐదు బ్లూ ఫ్లాగ్ బీచ్‌లుండేవని, ఇప్పుడు వీటి సంఖ్య మళ్లీ ఆరుకు చేరిందని అధికారి హర్షం వ్యక్తంచేశారు. పర్యాటకశాఖ అధికారులు ఈ బీచ్‌ను పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు