అతడు సజీవంగానే ఉన్నాడు, వేటాడతాం: అమెరికా

1 Jan, 2017 09:20 IST|Sakshi
అతడు సజీవంగానే ఉన్నాడు, వేటాడతాం: అమెరికా

వాషింగ్టన్‌: ఉగ్ర సంస్థ ఐసిస్‌ చీఫ్‌ అబూ బకర్‌ అల్‌–బాగ్దాదీని మట్టుబెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన ఇంకా సజీవంగానే ఉన్నాడని నమ్ముతున్నట్లు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. తాను 2014లో ఖలీఫా రాజ్యాన్ని ప్రకటించిన, ప్రస్తుతం బలగాల ముట్టడిలో ఉన్న మోసుల్‌ పట్టణంలోనే ఉన్నాడా అన్న దానిపై స్పష్టత లేదని తెలిపింది.

‘బాగ్దాదీ ప్రాణాలతో ఉన్నాడని, ఐసిస్‌ను నడిపిస్తున్నాడని నమ్ముతున్నాం. అయన కదలికలు పసిగట్టేందుకు చేయాల్సినదంతా చేస్తున్నాం. ఆయనకు తగిన శాస్తి చేయడానికి దొరికిన ఏ అవకాశాన్నీ వదులుకోం. ఇందుకోసమే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాం’ అని పెంటగాన్‌ ప్రతినిధి పీటర్‌ కుక్‌ చెప్పారు. సంకీర్ణ దళాలు చాలా మంది ఐసిస్‌ సభ్యులను అంతమొందించడంతో బాగ్దాదీకి సలహాలు ఇచ్చేవారు కరువయ్యారని, ఆయన ఒంటరైపోయారని తెలిపారు. బగ్దాదీ తలపై బహుమానాన్ని అమెరికా ఈ మధ్యే రెండింతలు పైగా పెంచుతూ 25 మిలియన్‌ డాలర్లు చేసింది.

ఐసిస్‌ చివరిసారిగా విడుదల చేసిన 2014 నాటి వీడియోలో బాగ్దాదీగా భావిస్తున్న వ్యక్తి నెరిసిన గడ్డం, నల్ల దుస్తులు, తలపాగాతో కనిపిస్తూ మోసుల్‌ను కాపాడుకోవాలని మద్దతుదారులకు సందేశమిచ్చాడు. 2016, జూన్‌ లో సంకీర్ణ దళాల దాడుల్లో అబు బకర్ చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అతడు బతికేవున్నట్టు అమెరికా తాజాగా ప్రకటించింది.

>
మరిన్ని వార్తలు