'జుకర్ బర్గ్, జాక్లను చంపేస్తాం'!

26 Feb, 2016 01:42 IST|Sakshi
'జుకర్ బర్గ్, జాక్లను చంపేస్తాం'!

లండన్: ప్రపంచ వ్యాప్తంగా అనూహ్య ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని నరమేధం కొనసాగిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ కన్ను ఇప్పుడు ఫేస్బుక్, ట్విట్టర్లపై పడింది. ఈరెండు సంస్థల బాస్లను తాము త్వరలోనే హత్య చేస్తామంటూ ఐసిస్ ఓ వీడియోను కూడా విడుదల చేసింది. ఈ వీడియోలో డిజిటల్ టెక్నాలజీతో ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జూకర్ బర్గ్, ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సేల ఫొటోలను చూపిస్తూ వాటికి బుల్లెట్లతో రంధ్రాలు పెడుతున్నట్లు చూపించారు.

ఉగ్రవాదానికి, తీవ్ర భావజాలానికి సంబంధించిన అంశాలకు చోటులేదని ప్రకటించి అలాంటి కంటెంట్ మొత్తాన్ని ఈ రెండు వెబ్ సైట్లు తొలగించడంతోపాటు మున్ముందు అలాంటివి పోస్ట్ చేసే అవకాశం లేకుండా చేశాయి. ఈ నేపథ్యంలోనే ఐసిస్ ఈ రెండు సైట్ల పెద్ద తలకాయలను టార్గెట్ చేసుకుంటున్నట్లు ప్రకటించింది. సన్స్ ఆఫ్ కాలిపత్ ఆర్మీ అనే పేరిట విడుదల చేసిన ఈ వీడియోలో పలు హెచ్చరికలను  కూడా ఐఎస్ చేసింది. తాము ఇప్పటి వరకు 10,000 ఫేస్ బుక్ ఖాతాలు,150 ఫేస్ బుక్ గ్రూప్స్ ను హ్యాక్ చేసినట్లు చెప్పింది.

5,000 ట్విట్టర్ ఖాతాలను కూడా దొంగిలించినట్లు వెల్లడించింది. ఫేస్ బుక్, ట్విట్టర్ తన చర్యలు ఆపేయకుంటే వాటిని తన మద్దతుదారులకు తాము హ్యాక్ చేసిన ఖాతాలను కేటాయిస్తామని బెదిరించింది. 'మీరు, మీ అమెరికా ప్రభుత్వం మా ఖాతాలను ఎన్నైనా తొలగించుకోవచ్చు. వాస్తవానికి ఇప్పటి వరకు మాకు లక్ష్యంగా లేరు. కానీ ఇప్పటి నుంచి మీరు ఒక్క ఖాతా తొలగిస్తే మేం పది సృష్టిస్తాం. త్వరలోనే మీ పేర్లు చెరిపేస్తాం, మీ సైట్లను కుప్పకూల్చేస్తాం' అని ఐఎస్ హెచ్చరించింది.

మరిన్ని వార్తలు