యూరప్‌లోకి చాపకింద నీరులా.. ఐఎస్ఐఎస్

27 May, 2016 14:48 IST|Sakshi
యూరప్‌లోకి చాపకింద నీరులా.. ఐఎస్ఐఎస్

ఇప్పటివరకు ఐఎస్ఐఎస్ ప్రాబల్యం సిరియా, లిబియా లాంటి కొన్ని ప్రాంతాలకే పరిమితం అయ్యిందని అనుకుంటున్నాం. కానీ క్రమంగా అది యూరప్‌లోకి కూడా చొచ్చుకుపోతోంది. ఈ విషయం తాజాగా వెల్లడైనట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. లిబియా నుంచి యూరప్‌కు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను రహస్యంగా బోటులో తరలించాలని, అందుకు భారీ మొత్తం ఇస్తామని చెబుతున్నారు. ఇటీవల అబు వాహిద్ (పేరు మార్చాం) అనే వ్యక్తికి 25 మందిని యూరప్‌కు చేరిస్తే ఒక్కొక్కరికి లక్ష రూపాయల వంతున ఇస్తామని ఆఫర్ వచ్చింది. అయితే అతడు దాన్ని తిరస్కరించాడు. ఇలాంటి ఆఫర్లు గత రెండు నెలలుగా ఎక్కువగా వస్తున్నాయట. తమ మనుషులను ఎలాగోలా యూరప్‌లోకి పంపేందుకు ఐఎస్ఐఎస్ ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. టర్కీ నుంచి గ్రీస్ మార్గంలో అయితే నిఘా ఎక్కువగా ఉంటోందని లిబియా మార్గాన్ని వాళ్లు ఎంచుకుంటున్నారు.

ఇన్నాళ్లూ ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో మాత్రమే వలస కార్మికుల దోపిడీ కొనసాగేదని, ఇప్పుడు అమెరికా, యూరోపియన్ దేశాలు వెంటనే దీనిపై స్పందించాలని పాశ్చాత్య దేశాలకు చెందిన ఓ దౌత్యవేత్త చెప్పారు. ట్యునీషియా నుంచి 40 మంది ఐఎస్ఐఎస్ సభ్యులు సిర్టె ప్రాంతం నుంచి బయల్దేరారు. అయితే వాతావరణం బాగోకపోవడంతో అప్పటికి ఆగి, మరో పది రోజుల తర్వాత మళ్లీ ప్రయత్నించారు. ఇలా వెళ్లేవాళ్లు తమమీద ఏమాత్రం అనుమానం రాకుండా ఆయుధాలు వదిలేసి, పెళ్లాం బిడ్డలతో కలిసి వెళ్తూ శరణార్థుల ముసుగులో చల్లగా జారుకుంటున్నారు. అమెరికన్లలా దుస్తులు వేసుకుని, ఇంగ్లీషు పేపర్లు పట్టుకుని తమమీద అనుమానం రాకుండా చూసుకుంటున్నారు. వీళ్లను అడ్డుకోడానికి యూరోపియన్ యూనియన్ కౌంటర్ టెర్రరిజం అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఉగ్రవాదులు వస్తున్న విషయం ఒకవేళ నిజమే అయితే మాత్రం.. అది చాలా ప్రమాదకరమని, ఎవరో ఒకరిద్దరు కాకుండా గుంపులుగా ఎక్కువ సంఖ్యలో వాళ్లు వస్తే పెద్ద ముప్పే పొంచి ఉంటుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు