చైనా, నార్వే బందీలను చంపేశారు

19 Nov, 2015 10:26 IST|Sakshi

బీరట్: తమ ఆధీనంలో బందీలుగా ఉన్న ఒక చైనీయుడు, ఒక నార్వే పౌరుడిని చంపేసినట్టు ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. సిరియాలోని తమ ప్రాబల్య ప్రాంతాలపై ఫ్రాన్స్, రష్యా వైమానిక దాడులు ముమ్మరమవ్వడం.. ఈ దాడుల్లో 33 మంది తమ ఫైటర్లు మృతిచెందడంతో ఆ గ్రూప్ ఈ మేరకు ప్రతీకార చర్యలకు ఒడిగట్టింది.

చైనా పౌరుడు ఫాన్ జింఘ్యూ, నార్వే పౌరుడు ఓల్‌ జోహన్ గ్రిమ్స్‌గార్డ్ ఆఫ్‌స్టాడ్‌లను చంపేసినట్టు పేర్కొంటూ వారి మృతదేహాలతో కూడిన గ్రాఫిక్ చిత్రాలను ఐఎస్ఐఎస్ ఆంగ్ల మ్యాగజీన్ దబిఖ్‌ ప్రచురించింది. అవిశ్వాస దేశాలు ఈ బందీల గురించి పట్టించుకోకపోవడంతో చంపేసినట్టు పేర్కొంది. ఫొటోలను బట్టి వారి తలలో బుల్లెట్‌ దించి హతమార్చినట్టు తెలుస్తున్నది. 129 మందిని పొట్టనబెట్టుకున్న పారిస్‌లో నరమేధం అనంతరం ఐఎస్ఎస్ఐపై అగ్రరాజ్యాల దాడి తీవ్రమైంది. పారిస్ ఘటనతో ఫ్రాన్స్, విమానం కూల్చివేత ఘటనతో రష్యా ఐఎస్ఐఎస్ అంతుచూసేందుకు కంకణం కట్టుకున్నాయి. దీంతో సిరియాలోని ఆ ఉగ్రవాద సంస్థ ప్రాబల్య ప్రాంతాల్లో వైమానిక దాడులు ముమ్మరమయ్యాయి.

మరిన్ని వార్తలు