ఇక లక్ష్యం సొంత గడ్డే!

29 Oct, 2017 02:21 IST|Sakshi

ఐసిస్‌ పతనంతో స్వస్థలాలకు మరలుతున్న ఉగ్ర సానుభూతిపరులు

భారత్‌కు పొంచి ఉన్న పెను ముప్పు

సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌: దాదాపు తుడిచిపెట్టే దశకు చేరుకున్న ఉగ్ర సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌ఐఎస్‌)తో కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాక్‌లో తమ ప్రధానకేంద్రం మోసుల్‌ను చేజార్చుకోవడం, తాజాగా సిరియాలోని రఖాలో ఓటమి అంచుల్లో నిలవడంతోనే ఐసిస్‌ కథ ముగిసిందని భావించే పరిస్థితి లేదు. ఐసిస్‌ తరఫున ఇరాక్, సిరియా, ఆఫ్గానిస్తాన్‌లలో పోరాడేందుకు వెళ్లిన వివిధ దేశాల్లోని  సానుభూతిపరులు తమ దేశాలకు మరలడం మొదలుపెట్టారు.

ఇక తమ యుద్ధాన్ని సొంత గడ్డపైనే కొనసాగించేందుకు తిరిగి వెళ్లాలంటూ వారిని ఐసిస్‌ ఆదేశించినట్లు వార్తలొచ్చిన నేపథ్యంలో ఈ పరిణామం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సైద్ధాంతికంగా ఐసిస్‌ భావజాలంతో పాటు ఉగ్రశిక్షణ పొందిన వీరి వల్ల భారత్‌లోనూ దాడులు జరిగే ప్రమాదం పొంచి ఉందని నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి. కేరళ నుంచి ఐసిస్‌ సానుభూతిపరులను రిక్రూట్‌ చేస్తున్న ‘హమ్సా తాలిబన్‌’  హమ్జా థలసెర్రీ, ఉగ్రమూకలతో సంబంధాలున్న మహ్మద్‌ మనాఫ్‌ను గురువారం కేరళలోని కన్నూరులో పోలీసులు అరెస్ట్‌చేశారు.

ఐసిస్‌ సానుభూతిపరులన్న అనుమానంతో బుధవారం అదే రాష్ట్రంలో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికలకు ముందు దాడులకు ప్రణాళికలు రచిస్తున్నారన్న ఆరోపణలతో గుజరాత్‌లో మరో ఇద్దరిని అరెస్ట్‌చేశారు. ఐసిస్‌ కోసం పనిచేసి తిరిగొస్తున్న సానుభూతిపరులపై పర్యవేక్షణ ఉండాలని ఇంటెలిజెన్స్‌బ్యూరో హెచ్చరిస్తోంది. విమానాశ్ర యాలు, పోర్టులతో పాటు సరిహద్దులపై గట్టి నిఘా ఉంచాలని సూచించింది.  

విదేశాల నుంచి నిధులు....
గతంలో తాలిబన్‌ నాయకుడికి వంటవాడిగా పనిచేసిన హమ్జా తరువాత ఐసిస్‌ వైపు ఆకర్షితుడయ్యాడు. అతను 40 మంది యువకులను ఐసిస్‌ కోసం నియమించుకుని సిరియా, యెమెన్, ఆఫ్గానిస్తాన్‌లకు పంపినట్లు తెలిసింది. సౌదీ అరేబియా, ఒమన్‌ల నుంచి నిధులు అందుతున్నట్లు పోలీసుల విచారణలో హమ్జా వెల్లడించాడు. హమ్జా భారత్‌కు తిరిగి వచ్చాక నిఘా సంస్థలు అతనిపై అయిదు నెలల పాటు నిఘా ఉంచి పట్టుకున్నాయి. రెండు పాస్‌పోర్టులు కలిగి ఉండటంతో పాటు, వివిధ దేశాలు చుట్టి వచ్చిన హమ్జా.. కేరళతో పాటు పశ్చిమ ఆసియా దేశాల నుంచి పలువురిని ఐసిస్‌ కోసం నియమించుకున్నట్లు భావిస్తున్నారు.  

దక్షిణాదిలో ఆపరేషన్‌ ?
కేరళలో పట్టుబడినవారిని విచారిస్తున్న సందర్భంగా దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రసిద్ధ ప్రదేశాలు, ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్రణాళికలను రచిస్తున్నట్లు బయటపడింది. పేలుడు పదార్థాల సేకరణలో నిమగ్నమైనట్లు బుధవారం పట్టుకున్న ముగ్గురు వెల్లడించినట్లు పోలీసువర్గాలు వెల్లడించాయి. ఈ ముగ్గురు సిరియాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడటంతో టర్కీ అధికారులు భారత్‌కు పంపారు. ఎవరెవరు విదేశాలకు వెళుతున్నారు, వారక్కడ ఏమి చేస్తున్నారు, తిరిగి వచ్చాక ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే దానిపై పోలీసుల వద్ద సమాచారం కొరవడింది. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతున్న అమెరికా, బ్రిటన్,ఫ్రాన్స్, టర్కీ,యూఏఈ, ఇరాన్, సౌదీలతో కలసి పనిచేస్తూ, ఆయా దేశాల నుంచి భారత్‌ వస్తున్న అనుమానితుల వివరాలను సేకరించాల్సి ఉంది.
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు