దేశం కోసం గాయపడ్డాను: నెతన్యాహు భావోద్వేగం

22 Nov, 2019 10:52 IST|Sakshi

జెరూసలేం : ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుపై లంచగొండితనం, మోసం, నమ్మకద్రోహం తదితర నేరాల కింద కేసులు నమోదయ్యాయి. నెతన్యాహు, ఆయన భార్య కొంతమంది బడా వ్యక్తులకు రాజకీయ ప్రయోజనాలు చేకూర్చినందుకు గానూ దాదాపు 2 లక్షల అరవై వేల డాలర్లను విలాస వస్తువుల రూపంలో స్వీకరించినట్లుగా అభియోగాలు నమోదయ్యాయి. ఈ మేరకు ఇజ్రాయెల్‌ అటార్నీ జనరల్‌ అవిచాయ్‌ మాండెల్‌బ్లిట్‌ 63 పేజీల అభియోగ పత్రాన్ని కోర్టుకు సమర్పించారు. మూడేళ్ల దర్యాప్తులో భాగంగా నెతన్యాహు, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం లంచాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ‘ వ్యక్తిగతంగా ఈ విషయం నన్నెంతగానో బాధిస్తుంది. అయితే న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టడానికే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ప్రధానికి వ్యతిరేకంగా మూడు కేసులు నమోదయ్యాయి. చట్టం ముందు అందరూ సమానులే. ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసేందుకు.. న్యాయ వ్యవస్థపై ఇజ్రాయెల్ ప్రజల నమ్మకాన్ని మరింతగా ఇనుమడింపజేసేందుకు.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని చాటిచెప్పేందుకే మీ అందరి ముందుకు వచ్చాను అని ఆయన వ్యాఖ్యానించారు. 

కాగా ఆరోపణలను బెంజమిన్‌ నెతన్యాహు ఖండించారు. తనపై అభియోగాలను లంచగొండులైన న్యాయవాదుల తిరుగుబాటుగా ఆయన అభివర్ణించారు. ‘విచారణ జరిపిన వారి గురించి విచారణ జరపాల్సిన సమయం వచ్చింది. స్వయంప్రతిపత్తి గల సంస్థ చేత ఇలాంటి వాళ్లపై విచారణకు కోర్టు ఆదేశించాలి’ అని ఆయన డిమాండ్‌ చేశారు. అదే విధంగా... ‘ ఈ దేశం కోసం నా జీవితాన్ని ధారబోశాను. యుద్ధం చేశాను. గాయపడ్డాను. అంతర్జాతీయ వేదికపైన ఇజ్రాయెల్‌ను ఓ బలమైన శక్తిగా నిలిపేందుకు ఎల్లవేళలా కృషి చేశాను. దేశ శ్రేయస్సుకై పోరాడి సాధించిన విజయాల పట్ల ఎంతో గర్విస్తున్నాను. అయితే ప్రస్తుత సంఘటనలు నన్ను, నాకు అండగా నిలిచిన వారిని అగాథంలోకి నెట్టేశాయి’ అని ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. 

ఇక ఇజ్రాయెల్‌ దేశ చరిత్రలోనే ఇలాంటి ఆరోపణలు చేయబడిన మొదటి ప్రధానిగా నెతన్యాహు నిలిచారు. అదే విధంగా ఈ ఆరోపణలు రుజువు అయినట్లయితే తన పదవికి రాజీనామా చేయడంతో పాటుగా... కొన్ని నెలల పాటు జైలు శిక్ష పడే అనుభవించాల్సి ఉంటుంది. కాగా ఇజ్రాయెల్‌ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలోనూ నెతన్యాహు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారంటూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజా ప్రయోజనాలు తాకట్టు పెట్టి వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి ఖరీదైన నగలు, సిగరెట్లు తదితర వస్తువులు లంచంగా స్వీకరించారంటూ ప్రస్తుతం ఆయనపై చార్జిషీట్‌ నమోదైంది. ఈ క్రమంలో నెతన్యాహు రాజీనామా చేయాలంటూ ఆయన నివాసం ఎదుట నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ఇక సుదీర్ఘకాలంగా ప్రధానిగా సేవలు అందించిన నెతన్యాహు లికుడ్‌ పార్టీ  నుంచి తొలిసారిగా పోటీ చేసి.. ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. 1993లో పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి వివిధ పదవులు అలకరించారు. 

మరిన్ని వార్తలు