ఇజ్రాయెల్‌కు ఐదు టన్నులు సరఫరా.. మోదీకి థాంక్స్‌!

10 Apr, 2020 12:35 IST|Sakshi

న్యూఢిల్లీ: మానవాళి మనుగడకు ముప్పుగా పరిణమించిన కరోనా వైరస్‌పై పోరులో ప్రపంచ దేశాలకు అండగా ఉంటున్న భారత్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. కోవిడ్‌-19ను కట్టడి చేసేందుకు మలేరియా యాంటీ డ్రగ్‌ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ వాడకం సత్ఫలితాలను ఇస్తుందని భావిస్తున్న తరుణంలో అగ్రరాజ్యం అమెరికా సహా ఇతర దేశాలు భారత్‌ సాయం కోరిన విషయం తెలిసిందే. అత్యవసర మందులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసి.. తమకు అండగా నిలవాలని అభ్యర్థించాయి. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ సర్కారు ఇప్పటికే అమెరికాకు మాత్రలు సరఫరా చేసిన భారత్‌.. బ్రెజిల్‌కు అండగా ఉంటామని భరోసానిచ్చింది. (ఈ మేలు మర్చిపోము: ట్రంప్‌)

ఈ క్రమంలో ఆయా దేశాధినేతలు భారత ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. దాదాపు 29 మిలియన్ల డోసుల డ్రగ్స్‌ ఎగుమతి చేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, కరోనాపై పోరులో సహకారం అందిస్తామన్నందుకు బ్రెజిల్‌ అధ్యక్షుడు జేర్‌ బోల్సోనారో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు సైతం ఇదే బాటలో నడిచారు. దాదాపు ఐదు టన్నుల మెడిసన్‌ ఇజ్రాయెల్‌కు పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు. (మోదీకి కృతజ్ఞతలు తెలిపిన బ్రెజిల్‌ అధ్యక్షుడు)

ఈ మేరకు.. ‘‘ ఇజ్రాయెల్‌కు క్లోరోక్విన్‌ పంపినందుకు నా స్నేహితుడు, భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు. ఇజ్రాయెల్‌ పౌరులందరూ మీకు ధన్యవాదాలు చెబుతున్నారు’’ అని నెతన్యాహు గురువారం ట్వీట్‌ చేశారు. ఇందుకు స్పందించిన మోదీ.. ‘‘ మహమ్మారిపై కలిసికట్టుగా పోరాడుతాం. స్నేహితులకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా భారత్‌ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఇజ్రాయెల్‌ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని పార్థిస్తున్నాం’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

కాగా కరోనా ధాటికి ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు 86 మంది మృతి చెందగా... దాదాపు 10 వేల మంది దీని బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో తమకు మాస్కులు సరఫరా చేయాలని ప్రధాని మోదీకి మార్చి 13న విజ్ఞప్తి చేసిన నెతన్యాహు.. ఏప్రిల్‌ 3న క్లోరోక్విన్‌ సరఫరా చేయాల్సిందిగా అభ్యర్థించారు. ప్రధాని మోదీ ఇందుకు సానుకూలంగా స్పందించి ఇజ్రాయెల్‌కు అండగా నిలిచారు.

మరిన్ని వార్తలు