గాజాపై ఇజ్రాయెల్‌ క్షిపణుల వర్షం

9 Dec, 2017 17:32 IST|Sakshi
ఇజ్రాయెల్‌ క్షిపణి దాడికి గురైన గాజాలోని హమాస్‌ గ్రూపునకు చెందిన స్థావరం

గాజా : ఇజ్రాయెల్‌ వాయుదళం టెర్రరిస్టు ఆక్రమిత ప్రాంతమైన గాజాపై శనివారం తెల్లవారుజామున క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దాడిలో అనేక తీవ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయి. శక్తిమంతమైన మిస్సైల్స్‌ను ఎయిర్‌బేస్‌లపై ఇజ్రాయెల్‌ ప్రయోగించడంతో టెర్రరిస్టు గ్రూపు హమాస్‌ ఘోరంగా దెబ్బతింది.

అంతకుముందు శనివారం అర్థరాత్రి సమయంలో హమాస్‌ గ్రూపు మూడు క్షిపణులను ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది. వీటిలో ఒకదాన్ని ఇజ్రాయెల్‌ రక్షణ వ్యవస్థ నేలకూల్చింది. మరొకటి కొంతదూరం ప్రయాణించి కుప్పకూలగా.. ఇంకొకటి మాత్రం నగరాన్ని తాకింది. దీంతో ప్రతీకార చర్యగా ఇజ్రాయెల్‌ రాత్రికి రాత్రి గాజాపై దాడికి పూనింది. కాగా, ఇజ్రాయెల్‌ క్షిపణి దాడుల్లో ఇద్దరు హమాస్‌ తీవ్రవాదులు హతం అయ్యారు. మరో 15 మంది గాయపడినట్లు రిపోర్టులు వచ్చాయి.

గాజా–వెస్ట్‌ బ్యాంక్‌ సమస్య :
పాలస్తీనా–ఇజ్రాయెల్‌ల మధ్య అనేక అంశాల్లో వివాదాలున్నాయి. ఈ నేపథ్యంలో వీటి మధ్య 1948, 1967ల్లో యుద్ధాలు కూడా జరిగాయి. 1967నాటి యుద్ధంలో పాలస్తీనా పరిధిలో ఉన్న వెస్ట్‌ బ్యాంక్, గాజాలు ఇజ్రాయెల్‌ సొంతమయ్యాయి. ప్రస్తుతం వెస్ట్‌బ్యాంక్‌ ఎక్కువగా ఇజ్రాయెల్‌ ఆధీనంలోనే ఉంది. దీంతో ఇక్కడ జరిగే కార్యకలాపాల్ని, ఇజ్రాయెల్‌ వ్యతిరేక నిరసనల్ని ఆ దేశం విజయవంతంగా అణచివేస్తోంది. పైగా ఇక్కడ క్రమంగా యూదుల సంఖ్య పెరుగుతోంది. కాగా, గాజా మాత్రం హమాస్‌ అనే ఇస్లామిక్‌ సంస్థ ఆధీనంలో ఉంది. గాజా, వెస్ట్‌ బ్యాంక్‌ ప్రాంతాలను దక్కించుకునేందుకు ఇజ్రాయెల్, పాలస్తీనాలు ప్రయత్నిస్తున్నాయి.

మరిన్ని వార్తలు