భూమి నుంచి అంతరిక్షంలో వైద్యం

5 Jan, 2020 02:37 IST|Sakshi
ప్రొఫెసర్‌ స్టీఫన్‌

అంతరిక్షంలో వ్యోమగామికి రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తం

భూమ్మీద నుంచి కొనసాగిన చికిత్స

వ్యోమగామి భూమికి వచ్చేనాటికి నయమైన వ్యాధి

వాషింగ్టన్‌: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో ఉన్న ఓ వ్యోమగామికి మెడ రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టింది. దానికి భూమ్మీద నుంచే ఓ వైద్య బృందం చికిత్స అందించింది. ఈ విధంగా చికిత్స అందించడం ఇదే తొలిసారి. ఆరు నెలల పాటు విధులు నిర్వర్తించేందుకు ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన వ్యోమగామికి ఈ సమస్య ఉన్నట్లు అక్కడికెళ్లిన రెండో నెలలో తెలిసింది. వైద్య బృందాన్ని వేగంగా అక్కడికి పంపే అవకాశం లేకపోవడంతో భూమి నుంచే వైద్యాన్ని కొనసాగించారు.  గడ్డకట్టిన రక్త నాళాలకు చికిత్స అందించే నిపుణుడైన ప్రొఫెసర్‌ స్టీఫన్‌ మోల్‌ ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లారు.

మెయిల్స్‌ ద్వారా సమాచారం పంపుకుం టూ వైద్యం కొనసాగించారు. రక్తం గడ్డకట్టకుండా చూసే ప్రత్యేక మందును ఆయన ఇంజెక్షన్‌ ద్వారా తీసుకునేవారు. 40 రోజుల పాటు ఈ వైద్యం కొనసాగిన తర్వాత ప్రత్యేక రాకెట్‌ ద్వారా తర్వాత వాడాల్సిన మందులను పంపించారు. మొత్తంగా ఈ చికిత్స 90 రోజుల పాటు కొనసాగింది. వ్యోమగామి తిరిగి భూమి మీదకు వచ్చే నాలుగు రోజుల ముందు చికిత్సను ఆపేశారు. అతను భూమ్మీదకు వచ్చేసరికి తదుపరి చికిత్స కూడా అవసరం లేకుండా వ్యాధి నయమైందని సంబంధిత వర్గాలు విడుదల చేసిన అధ్యయనంలో తేలింది.
 

మరిన్ని వార్తలు