జార్జ్‌ది నరహత్యే !

2 Jun, 2020 09:43 IST|Sakshi

వాషింగ్టన్‌ : జార్జ్ ఫ్లాయిడ్‌ (46) మరణంపై అమెరికా అట్టుడుకుతున్న సమయంలో కీలక మైన అధికారిక పోస్ట్‌మార్టం నివేదిక వెలువడింది. అతని మెడపై బలమైన ఒత్తిడి వలనే చనిపోయాడని, ఇది నరహత్య అని మినియాపోలిస్‌లోని హెన్నెపిన్ కౌంటీ వైద్యులు నిర్ధారించారు. పోలీసులు అదుపులో ఉండగా అతడు  గుండెపోటుకు గురైనట్లు నివేదిక తెలిపింది. (నల్లజాతి ప్రతిఘటన)

అటు ఫ్లాయిడ్ కుటుంబం ఏర్పాటు చేసిన ప్రైవేట్ పరీక్షల విచారణలోనూ ఇది పోలీసుల హత్యగానే నిర్ధారణ అయింది. ఫ్లాయిడ్ కుటుంబానికి చెందిన న్యాయవాది బెంజమిన్ క్రంప్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు జార్జ్‌ని నిరోధిస్తున్నపుడే..గుండె కొట్టుకోవడం ఆగిపోయిందన్నారు. మెడపై ఒత్తిడి కారణంగా మెదడుకు రక్త ప్రవాహం ఆగిపోవంతో మరణించాడని పరీక్షల్లో తేలినట్టు క్రంప్ చెప్పారు.  పోలీసుల  అమానుషంతోనే అతను మరణించాడని,  అంబులెన్సే  జార్జ్‌కు పాడెగా మారిందని వ్యాఖ్యానించారు. (దేశీయ ఉగ్రవాద చర్యలు: రంగంలోకి సైన్యం)

కాగా మినెసోటా రాష్ట్రంలోని మినియాపోలిస్‌లో గత సోమవారం జార్జ్ ఫ్లాయిడ్ అనే ఓ నల్ల జాతి వ్యక్తిని అదుపులోకి తీసుకునే క్రమంలో తెల్ల జాతి పోలీస్ అధికారి డెరెక్ షావిన్ అతని మెడపై మోకాలితో బలంగా నొక్కుతుండగా ప్రాణాలు కోల్పోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నిరాయుధుడైన ఆఫ్రికన్-అమెరికన్ పౌరుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి పోలీసులే కారణమంటూ ఎగిసిన నిరసనలతో అమెరికా అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు