భారతీయులకు ధన్యవాదాలు: ఇవాంక

14 Dec, 2017 14:33 IST|Sakshi

అమెరికా అధ్యక్షుని సలహాదారు, డోనాల్డ్‌ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్‌ మరోసారి భారతీయులను కొనియాడారు. నవంబర్‌లో మూడురోజుల పాటు హైదరాబాద్‌లో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు( GES 2017) జరిగిన విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ సదస్సులో ఇవాంక విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. జీఈఎస్‌ సదస్సులో పాల్గొనడం గర్వకారణమని ఇవాంక  ట్వీట్‌ చేశారు. ' ప్రపంచ వ్యాప్తంగా 1200 మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, అందులో 350 అమెరికా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. వివిధ దేశాల నుంచి అతిధులకు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చిన భారత ప్రజలకు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు' అని ఆమె ట్విట్టర్‌ లో పేర్కొన్నారు. అంతేకాకుండా ట్వీట్‌ లో ఇవాంక  'ధన్యవాద్‌' అని ప్రత్యేకంగా హిందీపదం చేర్చడం విశేషం.

పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌)లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన ఇవాంక ఇక్కడ రెండురోజులు గడిపారు. హెచ్‌ఐసీసీలో జరిగిన జీఈఎస్‌ సదస్సులో పాల్గొనడంతో పాటు.. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఇచ్చిన విందుకు హాజరై.. నగరంలోని చారిత్రక గోల్కొండ కోటను సందర్శించారు. జీఈఎస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఇవాంక తన పర్యటనపై సంతృప్తి వ్యక్తం చేస్తూ అమెరికా వెళ్లాక ట్వీట్‌ చేశారు. హైదరాబాద్‌ నుంచి తిరిగి బయలుదేరే ముందు అమెరికా ప్రతినిధులతో కలిసి గోల్కొండ కోటను సందర్శించాను. అద్భుతమైన ఈ పర్యటనకు పరిపూర్ణ ముగింపు ఇది (ద పర్ఫెక్ట్‌ ఎండ్‌ టు ఏ రిమార్కబుల్‌ విజిట్‌)’  అని ఇవాంక ట్విట్టర్‌లో తెలిపిన విషయం తెలిసిందే. అయితే జీఈఎస్‌ ముగిసిన 15 రోజులు తర్వాత కూడా ఇవాంక భారత పర్యటనను గుర్తు చేసుకోవడం విశేషం. కాగా, ఇవాంక చేసిన ట్వీట్‌ను ఎక్కువ మంది షేర్‌ చేయడమే కాకుండా రీ ట్వీట్‌లు చేశారు.

మరిన్ని వార్తలు