ఇటలీలో భారీ భూకంపం: 247కి చేరిన మృతుల సంఖ్య

25 Aug, 2016 10:33 IST|Sakshi
ఇటలీలో భారీ భూకంపం: 247కి చేరిన మృతుల సంఖ్య

- ఇటలీలో పర్వత ప్రాంతాల్లో భారీ భూకంపం
- 247కి చేరిన మృతుల సంఖ్య, 368మందికి పైగా గాయాలు
- శిథిలాల కింద మృతదేహాలు.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం


అక్యుమోలి: ఇటలీలో భారీ భూకంపం ధాటికి గురువారం నాటికి మరణించిన వారి సంఖ్య 247కి చేరగా, 368మందికి పైగా గాయాలు అయ్యాయి. నిన్న (బుధవారం) తెల్లవారుజామున ఇటలీలోని కేంద్ర పర్వత ప్రాంతాల్లో 6.0 నుంచి 6.2 తీవ్రతతో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూ ప్రకంపనలు సంభవించిన సంగతి తెలిసిందే. దీని ఫలితంగా మధ్య ఇటలీలోని పర్వత ప్రాంతాల్లో ఉన్న పలు గ్రామాలు కకావికలమయ్యాయి. నిన్నటివరకూ 120 మంది మృతి చెందినట్లు ఇటలీ ప్రధాని రెంజీ ప్రకటించారు. అయితే నేటివరకూ మృతుల సంఖ్య దాదాపు 159వరకు చేరినట్టు అధికారులు వెల్లడించారు.

పలువురు శిథిలాల్లో చిక్కుకోగా.. మరికొంతమంది గల్లంతయ్యారు. భూకంపం ధాటికి పలు భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సహాయక బృందాలు శిథిలాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు చర్యలు చేపడుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కాగా, 2009లో ఇటలీలోని అకీలా ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపంలో 300 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి విధితమే.

అదేవిధంగా మయన్మార్‌లో 6.8 తీవ్రతతో..  మయన్మార్‌నూ భారీ భూకంపం సంభవించింది. సెంట్రల్ మయన్మార్‌లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. సుమారు 84 కిలోమీటర్ల వరకు వ్యాపించిన ప్రకంపనాలు పొరుగున ఉన్న థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, భారత్ తదితర దేశాలలో ప్రభావం చూపాయి.

మరిన్ని వార్తలు