కరోనా: ఇటలీలో ఇదే మొదటిసారి!

11 May, 2020 09:51 IST|Sakshi

రోమ్‌: ఇటలీ వాసులకు కాస్త ఊరట కలిగించే వార్త ఇది. కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందని తాజా లెక్కలు చెబుతున్నాయి. మార్చి ప్రారంభంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రారంభమైన తర్వాత తొలిసారిగా రోజువారి కోవిడ్‌-19 కేసులు అతి తక్కువగా నమోదయ్యాయి. ఇటలీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఆదివారం సాయంత్రంతో ముగిసిన 24 గంటల వ్యవధిలో 802 కరోనా పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. రోజువారి కోవిడ్‌ కేసుల నమోదులో 1,000 కంటే తక్కువ కరోనా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 2,19,070 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. (లాక్‌డౌన్‌ ఇప్పట్లో ముగిసేలా లేదు!)

శనివారం సాయంత్రం నుంచి గడిచిన 24 గంటల్లో 165 మంది కోవిడ్‌ బాధితులు చనిపోయారు. దీంతో కరోనా కారణంగా మృతిచెందిన వారి సంఖ్య  30,560కు పెరిగింది. అయితే మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండే అవకాశముందని అధికారులు అంటున్నారు. ఇంట్లో, నర్సింగ్‌ కేర్‌ సెంటర్లలో చనిపోయిన వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తే వాస్తవ సంఖ్య తెలుస్తుందన్నారు. మరణించిన వారిలో చాలామందికి ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండివుండొచ్చని తెలిపారు. ఇ​టలీలో అత్యధికంగా కరోనా ప్రభావానికి గురైన లాంబార్డీ ప్రాంతంలో కఠిన నిర్బంధం అమలు చేస్తుండటంతో ఇక్కడ వైరస్‌ వ్యాప్తి బాగా తగ్గింది. గత 24 గంటల్లో లాంబార్డీలో 282 కరోనా పాజిటివ్‌ కేసులు మాత్రమే వెలుగు చూశాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 41 లక్షలు దాటిపోగా.. 2,83,868 మరణాలు సంభవించాయి. (కరోనా పోరులో ట్రంప్‌ విఫలం)

మరిన్ని వార్తలు