యూరప్‌ అతలాకుతలం

16 Mar, 2020 04:43 IST|Sakshi
కరోనా విస్తరించకుండా స్పెయిన్‌ ఎమర్జెన్సీ ప్రకటించి ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో బార్సెలోనాలోని ఓ రోడ్డు ఇలా నిర్మానుష్యంగా మారింది.

విజృంభిస్తున్న కోవిడ్‌

ప్రపంచవ్యాప్తంగా 6 వేలు దాటిన మరణాలు

స్పెయిన్‌లో కరోనా సైరన్‌

ఇటలీలో ఒక్కరోజే 368 మరణాలు

ట్రంప్‌కి కరోనా సోకలేదు

లండన్‌/వాషింగ్టన్‌ :  చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ఐరోపా దేశాలకు విస్తరించి అతలాకుతలం చేస్తోంది. ఇన్నాళ్లూ ఇటలీలో విజృంభించిన ఈ మహమ్మారి, ఇప్పుడు స్పెయిన్‌లో రాత్రికి రాత్రి ఉధృతమైపోయింది. ఒకే రోజు ఏకంగా 2,000 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 8 వేలకి చేరువలో ఉంటే 288 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించారు. నిత్యావసర దుకాణాలు, ఫార్మసీలు మినహాయించి అన్నింటినీ మూసివేస్తున్నట్టు స్పెయిన్‌ ప్రభుత్వం ప్రకటించింది. రెండు వారాల పాటు ఈ నిషేధం కొనసాగుతుంది. ఐరోపా దేశాల్లో 1,907 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 1.59 లక్షలకుపైగా నమోదుకాగా, మృతుల సంఖ్య ఆరువేలు దాటింది.

స్పెయిన్‌ ప్రధాని భార్యకి కరోనా
సామాన్యుల దగ్గర్నుంచి దేశా ధినేతల కుటుంబాల వరకు కరోనా ఎవరినీ విడిచిపెట్టడం లేదు. తాజాగా స్పెయిన్‌ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్‌ భార్య బెగోనా గోమెజ్‌కు కరో నా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆమె తన గదికే పరిమితమయ్యారు. ఇప్పటికే పెడ్రో కేబినెట్‌లో ఇద్దరు మంత్రులకు కరోనా సోకింది.  

బ్రిటన్‌లో మరణాలు రెట్టింపు  
కేవలం 24 గంటల్లోనే బ్రిటన్‌లో కరోనా మహమ్మారి 10 మంది ప్రాణాలు తీసుకుంది. ఆ దేశంలో మృతుల సంఖ్య 11 నుంచి 21కి చేరుకుంది.కేసులు 1200వరకు పెరిగాయి. ఫ్రాన్స్‌లో కూడా కరోనా బెంబేలెత్తిస్తోంది. నైట్‌ లైఫ్‌కి పెట్టింది పేరైన ఫ్రాన్స్‌ అన్ని నైట్‌ క్లబ్బులు రెస్టారెంట్లు, బార్లు, థియేటర్లు మూసేసింది. అయితే ఆదివారం స్థానిక ఎన్నికల్ని మాత్రం య«థావిధిగా నిర్వహించింది. జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నా ఇటలీలో కరోనా అదుపులోకి రావడం లేదు. ఒకే రోజు 368 మంది మృతి చెందగా 20% కేసులు పెరిగి 21 వేలు దాటేశాయి. చైనాలో ఆదివారం మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ దేశంలో మృతుల సంఖ్య 3,199కి చేరుకుంది. ఇరాన్‌లో మరో 113 మంది ప్రాణాలు కోల్పోతే, కేసులు 724 పెరిగాయి.  

బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ నుంచి ఎలిజబెత్‌ రాణి తరలింపునకు సన్నాహాలు  
కరోనా భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ (93), ఆమె భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ (98) దంపతులను లండన్‌లోని బకింగ్‌çహామ్‌ ప్యాలెస్‌ నుంచి నార్‌ఫోల్క్‌లోని రాయల్‌ శాడ్రింగమ్‌ ఎస్టేట్‌కు తరలించనున్నారు. లండన్‌ నడిబొడ్డున బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ ఉండడంతో వచ్చిపోయే అతిథులు, సిబ్బంది ఎక్కువగా ఉంటారు. తొంభై ఏళ్ల వయసు దాటిన రాణిని అంతమంది మధ్యలో ఉంచడం ఇష్టం లేక 70 మంది సిబ్బందితో ఆమెను తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు:  1,59,844
మృతుల సంఖ్య: 6,036
కోలుకున్నవారు: 74,000కు పైగా  

మరిన్ని వార్తలు