180 మంది జలసమాధి!

18 Jan, 2017 09:27 IST|Sakshi
180 మంది జలసమాధి!

లిబియాలో సముద్ర తీరంలో ప్రమాదం
రోమ్‌: ఐరోపా దేశాల్లో వలసల బతుకులు అర్ధంతరంగా ముగిసిపోతున్నాయి. మరుభూమిగా మారిన తమ దేశంలో బతుక లేక... మర పడవల్లో పొరుగు దేశాలకు పయనమవుతున్న శరణార్థులు మధ్యధరా సముద్రంలో జలసమాధి అవుతున్నారు. తాజాగా లిబియా నుంచి ఇటలీకి వెళుతున్న శరణార్థుల్లో 180 మంది మధ్యధరా సముద్రంలో గల్లంతయ్యారు. తూర్పు ఆఫ్రికాకు చెందిన వీరంతా మరణించారని భావిస్తున్నారు. ఏడాది ఆరంభంలో ఇది అతిపెద్ద విషాదం.

శనివారం లిబియా తీరంలో బయలుదేరిన టూటైర్‌ పడవ... సముద్రంలో ఐదు గంటలు ప్రయాణించింది. ఆ సమయంలో మోటారు చెడిపోయింది. క్రమంగా పడవలోకి నీళ్లు రావడం మొదలుపెట్టాయి. ఒక్కొక్కరుగా ప్రయాణికులు నీటిలో మునిగిపోయారని ప్రత్యక్ష సాక్షుల కథనం ఆధారంగా అధికారులు తెలిపారు.  కాగా, ప్రమాదం నుంచి తప్పించుకున్న 38 మంది వలసదారులు మంగళవారం ట్రపానిలోని సిసిలియాన్‌ నౌకాశ్రయానికి చేరుకున్నారు. గత ఏడాది వేలాది మంది వలస బాటలో ప్రాణాలు కోల్పోయారు. అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం), ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ (యూఎన్‌హెచ్‌సీఆర్‌) ప్రతినిధులు, రెస్క్యూ బృందాలు మృతదేహాల కోసం గాలిస్తున్నాయి. 2016లో దాదాపు 1.81 లక్షల మంది శరణార్థులు ఇటలీ తీరానికి చేరినట్టు లెక్కలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు