ట్రంప్‌ ముగ్గురు భార్యల పంచాయితీ..

10 Oct, 2017 09:09 IST|Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చుట్టూ భార్యల పంచాయితీ తిరుగుతోంది. ఇప్పటికే ఆయన మొదటి భార్య పుస్తక రూపంలో గొంతును వినిపించడంతో భారీ చర్చ జరుగుతుండగా ఆమెకు ఇప్పుడు మరో భార్య తోడయ్యారు. ట్రంప్‌ ప్రస్తుత భార్య(మూడో భార్య) మెలానియా ట్రంప్‌ తాజాగా బరిలోకి వచ్చారు. ఇవానా ట్రంప్‌ను, ఆమె తర్వాత వచ్చిన మార్లా మ్యాపిల్స్‌ను పరోక్షంగా విమర్శించారు. 'రైజింగ్‌ ట్రంప్‌' అనే పేరిట ట్రంప్‌ మొదటి భార్య ఇవానా ట్రంప్‌ ఓ పుస్తకాన్ని రాసిన విషయం తెలిసిందే. ఆ పుస్తకంలోని ప్రమోషన్‌లో భాగంగా సోమవారం 'గుడ్‌ మార్నింగ్‌ అమెరికా' అనే కార్యక్రమంలో ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా 'నేనే ట్రంప్‌కు అసలైన భార్యను. అమెరికా ప్రథమ పౌరురాలిని నేనే' అని ఇవానా ట్రంప్‌ ప్రకటించుకున్నారు. అలాగే మరికొన్ని ప్రైవేట్‌ విషయాలు చెప్పారు. వారిద్దరికి కలిగిన ముగ్గురు సంతానం పెంపకం గురించి కూడా వెల్లడించారు. అంతేకాదు, తనకు శ్వేత సౌదానికి వెళ్లేందుకు నేరుగా మార్గం ఉందని, తన మాజీ భర్తను ఎప్పుడంటే అప్పుడు కలుసుకోగలనని అన్నారు. టెలిప్రమోటర్‌ లేకుండానే 45 నిమిషాలపాటు ప్రసంగం చేయగలనని, చర్చలు జరపగలనని, ఎంటర్‌టైన్‌ చేయగలనని ఇలా ఎన్నో చేసే అవకాశం తనకు ఉందని చెప్పారు.

కానీ, తనకు తన స్వేచ్ఛను అనుభవించడమే ఇష్టమని, అందుకే అలా చేయలేనని అన్నారు. పైగా వాషింగ్టన్‌లో ఉండేందుకు మెలానియా తెగ భయపడుతున్నట్లుందంటూ విమర్శించారు. దీంతో మెలానియా ట్రంప్‌ రంగంలోకి వచ్చారు. శ్వేతసౌద అధికారిక ప్రతినిధి ఒకరు మెలానియా తరుపున ఓ ప్రకటన చేశారు. 'వాషింగ్టన్‌లో ఉండటం అంటే మెలానియా ట్రంప్‌కు ఎంతో ఇష్టం. పైగా అమెరికా ప్రథమపౌరురాలిగా తనకు దక్కిన పాత్రను మెలానియా ఎంతో గౌరవంగా భావిస్తున్నారు. ఆమె తనకు దక్కిన గౌరవంతో చిన్నారులకు సహాయం చేసే పనుల్లో ఉన్నారు.. పుస్తకాలు అమ్ముకునే విషయంలో కాదు(ఇవానా ట్రంప్‌ను ఉద్దేశించి)' అని ఓ ప్రకటన విడుదల చేశారు.

మరిన్ని వార్తలు