ట్రంప్‌ అతి.. జీ20లో కూతురుని కూర్చోబెట్టాడు

9 Jul, 2017 09:09 IST|Sakshi
ట్రంప్‌ అతి.. జీ20లో కూతురుని కూర్చోబెట్టాడు

న్యూయార్క్‌: ఇప్పటికే బంధుప్రీతి, అశ్రిత పక్షపాతానికి పాల్పడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా ఆ ఆరోపణలకు మరింత ఆజ్యం పోసే పనిచేశారు. జీ 20 శిఖరాగ్ర సమావేశాలకు వెళ్లిన ఆయన వెంట కూతురు ఇవాంకను కూడా తీసుకెళ్లారు. ఈ విషయం తొలుత ఎవరికీ తెలియకపోయినా సమావేశాల సాక్షిగా ఈ విషయం బయటపడింది. అమెరికా వైట్‌ హౌస్‌ కూడా ఇవాంక జీ 20 సదస్సులో పాల్గొన్నారని స్పష్టం చేసింది. అయితే, ఇవాంక పూర్తి స్థాయి ప్రతినిధిగా వెళ్లకుండా ట్రంప్‌ ఏదో పనిమీద బయటకు వెళ్లినప్పుడు ఆయనకు బదులుగానే ఇవాంక వెళ్లి కూర్చున్నారని వైట్‌ హౌస్‌ మీడియా తెలిపింది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు అమెరికాలోని ప్రముఖులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం హాంబర్గ్‌లో జరుగుతున్న జీ 20 సదస్సులో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌, రిసెప్‌ తయ్యీప్‌ ఎర్డోగన్‌, ఎంజెలా మెర్కల్‌, థెరిసా మే వంటి ప్రపంచ దిగ్గజ నేతలు, దౌత్య ప్రతినిధుల మధ్య అనూహ్యంగా ఇవాంక ట్రంప్‌ కనిపించారు. ఆ సమయంలో ట్రంప్‌ అక్కడ లేరు. దీనిపై అక్కడ ఉన్న వారంతా కాస్తంత అవాక్కయ్యారు. ఇక అమెరికా నుంచైతే ఆమెకు ఏ అర్హత ఉందని ట్రంప్‌ తన కూతురుని అంతపెద్ద సదస్సులో కూర్చోబెట్టారని ప్రశ్నించారు. ట్రంప్‌కు ఉన్న అశ్రితపక్షపాతానికి ఇది పరాకాష్ట అని వారంతా మండిపడుతున్నారు. కాగా, ప్రపంచ నేతల ముందు తన కూతురు, మాజీ ఫ్యాషన్‌ డిజైనర్‌ అయిన ఇవాంకను ట్రంప్‌ పలువిధాలుగా కొనియాడుతూ ఆమెను వారికి పరిచయం చేశారట.

మరిన్ని వార్తలు