పాత మందుతో 48 గంటల్లో వైరస్‌కు చెక్‌?

7 Apr, 2020 04:17 IST|Sakshi

గుర్తించిన మొనాశ్‌ యూనివర్సిటీ

ప్రాణాంతక కరోనా వైరస్‌ను ఇవర్‌మెక్టిన్‌  అనే మందు 48 గంటల్లోనే మట్టుబెడుతున్నట్లు మొనాశ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనం స్పష్టం చేసింది. శరీరంలోని పరాన్న జీవులను చంపేందుకు ఈ మందును చాలాకాలంగా వాడుతుండగా ఆస్ట్రేలియాలోని మొనాశ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీన్ని కోవిడ్‌పై ప్రయోగించి చూసింది. పరిశోధన శాలలో పెంచిన కరోనా వైరస్‌పై ఈ మందును ప్రయోగించినప్పుడు ఒకే ఒక్క డోస్‌తో వైరస్‌ 48 గంటల్లో మరణించినట్లు ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన డాక్టర్‌ కైల్‌ వాగ్‌స్టాఫ్‌ తెలిపారు. ఈ మందు పరిశోధనశాలలో కరోనా వైరస్‌తోపాటు డెంగీ, ఇన్‌ఫ్లూయెంజా, జికా, హెచ్‌ఐవీ వైరస్‌లపై కూడా ప్రభావం చూపిందని చెప్పారు.  24 గంటల తరువాతే ప్రభావం కనిపించడం మొదలైందని వాగ్‌స్టాఫ్‌ తెలిపారు.

ఇవర్‌మెక్టిన్‌ను అందరికీ అందుబాటులోకి తేవాలంటే మరిన్ని పరీక్షలు తప్పనిసరిగా చేయాల్సి ఉందని, తాము కేవలం పరిశోధనశాలలో మాత్రమే ప్రయోగాలు చేశామని డాక్టర్‌ కైల్‌ వాగ్‌స్టాఫ్‌ తెలిపారు. అయితే ఈ మందును చాలాకాలంగా వాడుతున్న కారణంగా సురక్షితమైందని మాత్రం చెప్పవచ్చునని, వేసే మోతాదు ఎంతన్నది ఇంకా నిర్ణయించాల్సి ఉందని, ఇవన్నీ త్వరలో నిర్ణయిస్తామని చెప్పారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో, అనుమతి పొందిన చికిత్స ఏదీ లేని తరుణంలో ఇప్పటికే వాడుతున్న మందు ఒకటి అందుబాటులో ఉందని తెలిస్తే.. ప్రజలు వేగంగా కోలుకునే అవకాశం ఏర్పడుతుందని వివరించారు.  

>
మరిన్ని వార్తలు