జాధవ్‌ ఎప్పటికీ విడుదల కాలేడు

29 May, 2017 16:45 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాధవ్‌ను నిర్దోషిగా విడుదల చేసే ప్రసక్తే లేదని పాకిస్తాన్‌ న్యాయవాది ఖావర్‌ ఖురేషీ స్పష్టం చేశారు. కుల్‌భూషణ్‌ జాధవ్‌ కేసుకు సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో పాకిస్తాన్‌ తరఫున ఖావర్‌ ఖురేషీ వాదనలు వినిపించారు. అయితే అక్కడ పాక్‌కు చుక్కెదురు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖావర్‌ ఖురేషీ మాట్లాడుతూ... జాధవ్‌ కేసు చాలా స్పష్టమైందని, అతడిని ఎన్నటికీ నిర్దోషిగా విడుదల చేయడం జరగదని నేషన్‌ వార్త పత్రికిను ఉటంకిస్తూ అన్నారు.

అలాగే అంతర్జాతీయ న్యాయస్థానం అటు జాదవ్‌ను నిర్దోషిగా తేల్చలేదనీ, ఇటు విడుదల చేయలేదనీ వివరించారు.  ఆయన సోమవారమిక్కడ పాకిస్తాన్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. బాధ్యతాయుతంగా ప్రవర్తించిన పాకిస్తానీ అధికారులకు పాక్‌ మీడియా గౌరవించాలని అన్నారు. గూఢచర్యం ఆరోపణలపై పాకిస్తానీ మిలటరీ కోర్టు జాదవ్‌కు ఉరిశిక్ష విధించగా..అంతర్జాతీయ న్యాయస్థానం ఈ తీర్పుపై స్టే ఇచ్చిన విషయం తెల్సిందే.

కాగా జాధవ్‌ కేసులో ఐసీజేలో ఎదురైన పరాభవంతో పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రతిపక్షాలు, మీడియాతో పాటు న్యాయ నిపుణులు సైతం ఈ వ్యవహారంలో ప్రభుత్వం అనుసరించిన తీరును తప్పుపడుతున్నారు. దీంతో ఐసీజేలో జాధవ్‌ కేసు కోసం కొత్త న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేయాలని పాక్‌ సర్కారు నిర్ణయించింది. మరోవైపు జాధవ్‌కు పాక్‌ సైనిక కోర్టు విధించిన ఉరిశిక్షను అమలు చేయడంలో కింది కోర్టు విఫలమైందని ఇకనైనా ఆలస్యం చేయకుండా జాదవ్‌ను తక్షణమే ఉరితీయాంటూ పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ నేత, సెనేట్‌ మాజీ చైర్మన్‌ ఫరూక్‌ నయీక్‌ తరఫున  న్యాయవాది ముజామిల్‌ అలీ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.  దీనిపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

మరిన్ని వార్తలు