కుక్కను అవమానించినందుకు 37 ఏళ్ళ జైలు

15 Dec, 2015 19:37 IST|Sakshi
కుక్కను అవమానించినందుకు 37 ఏళ్ళ జైలు

విశ్వాసానికి మారుపేరుగా శునకాలను చెప్తాం. అంతటి ప్రేమను చూపించే పెంపుడు జంతువులను యజమానులూ ప్రాణప్రదంగా సాకడం కళ్ళారా చూస్తున్నాం. కానీ అదే శునకాన్ని అవమానించిన కారణంగా ఏళ్ళ తరబడి జైలు శిక్షపడటం ఎక్కడైనా చూశారా? ఇప్పుడు థాయిలాండ్ లో అదే జరిగింది. రాజుగారిని దేవుడి అవతారంగా, అత్యంత గౌరవంగా చూసే ఓ సాధారణ వ్యక్తి... ఆయనగారి శునకాన్ని అవమానించాడట.. ఇంకేముందీ అతగాడికి ఏకంగా 37 ఏళ్ళ జైలు శిక్ష పడింది. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నా.. థాయ్ చట్టప్రకారం జరిగిన విషయం...

సామాజిక మాధ్యమాలతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో... అన్నికష్టాలు కూడా ఉన్నాయనడానికి థాయ్ సంఘటన నిదర్శనంగా చెప్పొచ్చు. అందుబాటులో ఉందికాదాని సోషల్ మీడియాను ఎడా పెడా వాడేస్తే.. ఏమౌతుందో ఈ సంఘటన చెప్పకనే చెప్తోంది. ఓ సాధారణ వ్యక్తి సోషల్ మీడియాలో  రాజుగారి కుక్కపై చేసిన వ్యంగ్యాస్త్రాలు ఇప్పుడు అతడి తలకు చుట్టుకున్నాయ్. థాయిలాండ్ చట్టాల ప్రకారం సైనిక న్యాయస్థానాలు అతడికి ఏకంగా 37 ఏళ్ళ జైలు శిక్షను విధించాయి.

సుమారు 2002 సంవత్సరంలో కింగ్ భూమిబోలో అతడి పెంపుడు శునకం టాంగ్ డేంగ్ పై ఓ పుస్తకం రాశాడు. ఆ పుస్తకం స్ఫూర్తితో ఆ తర్వాత 'ఖూన్ టాంగ్ డేంగ్' పేరిట  ఓ యానిమేటెడ్ చిత్రం కూడా రూపొందింది. టాంగ్ డేంగ్ అన్న పేరున్న ఆ  సైనిక శునకాన్ని నిజంగా ఆ వ్యక్తి ఏమని దూషించాడో కచ్చితంగా చెప్పలేదు కానీ.. రాచరిక పాలనలో ఉన్నకఠిన చట్టాలను ఉల్లంఘించినందుకే అతడికి శిక్ష విధించి, గతవారం అరెస్టు చేసినట్లు మాత్రం తెలుస్తోంది.

మరిన్ని వార్తలు