-

డబ్ల్యూహెచ్‌ఓ నుంచి వైదొలగుతాం: బోల్సోనారో

6 Jun, 2020 15:38 IST|Sakshi
బ్రెజిల్‌ అధ్యక్షుడు జేర్‌ బోల్సోనారో(ఫైల్‌ఫొటో)

బ్రెసీలియా: బ్రెజిల్‌లో కరోనా వైరస్‌(కోవిడ్‌-19) విజృంభణ కొనసాగుతోంది. ఆరు లక్షల మందికి పైగా మహమ్మారి సోకగా.. దాదాపు 35 వేల మంది మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తూ అధ్యక్షుడు జేర్‌ బోల్సోనారో నిర్ణయాలు తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని.. ఆరోగ్య సమస్యల కంటే ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రజలు మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలో స్థానిక మీడియా సైతం బోల్సోనారో విధానాలను విమర్శిస్తూ.. ‘‘నిమిషానికో బ్రెజిలియన్‌ను బలితీసుకుంటున్న కరోనా సాధారణ ఫ్లూ వంటిదేనన్న వ్యాఖ్యలు చేసి మూడు నెలలు దాటిపోయింది’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఈ వార్తను చదువుతున్న సమయంలోనే కోవిడ్‌తో మరో బ్రెజిల్‌ పౌరుడి ప్రాణం పోయినా ఎవరికీ పట్టదు అంటూ ఫోహా డీ ఎస్‌. పౌలో తన ఎడిటోరియల్‌లో ఈ మేరకు భావోద్వేగ కథనం ప్రచురించింది. (కరోనా ఇప్పటికీ ప్రాణాంతకమే : డబ్ల్యూహెచ్‌ఓ)

ఇదిలా ఉండగా.. కరోనా విజృంభిస్తున్న తరుణంలోనూ ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కరోనా ఇప్పటికీ ప్రాణాంతకమైనదేనని.. అప్రమత్తంగా లేకపోతే ముప్పు తప్పదని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో బ్రెజిల్‌ అధ్యక్షుడు జేర్‌ బోల్సోనారో తాము డబ్ల్యూహెచ్‌ఓ నుంచి నిష్క్రమిస్తారంటూ బెదిరింపులకు దిగారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. కాగా ప్రాణాంతక కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాకు డబ్ల్యూహెచ్‌ఓ వంతపాడుతుందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలకు బోల్సోనారో మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.(40 వేలు దాటిన కరోనా మరణాలు)

మరిన్ని వార్తలు