రహస్యంగా మసూద్‌ విడుదల

10 Sep, 2019 03:25 IST|Sakshi
జైషే మహమ్మద్‌ చీఫ్‌ మౌలానా మసూద్‌ అజర్‌

కశ్మీర్‌లో దాడులకు పాక్‌ పన్నాగం

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను పొట్టన పెట్టుకున్న పుల్వామా దాడుల అనంతరం వాటికి బా«ధ్యత వహించిన జైషే మహమ్మద్‌ చీఫ్‌ మౌలానా మసూద్‌ అజర్‌ సహా ఎందరినో అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించిన పాక్‌ ఇప్పుడు తన దారి మార్చుకుంది. అజర్‌ని మూడో కంటికి తెలీకుండా రహస్యంగా జైలు నుంచి విడుదల చేసింది. అజర్‌ ప్రస్తుతం పాక్‌ జైల్లో లేడని, భవల్పూర్‌లో జైషే మహమ్మద్‌ ప్రధాన కార్యాలయంలో ఉన్నట్టుగా భారత్‌ ఇంటెలిజెన్స్‌కి సమాచారం అందింది.

కశ్మీర్‌లో అల్లకల్లోలం సృష్టించడానికి, భారత్‌లో భారీగా దాడులకు పాక్‌ కుట్ర పన్నుతున్నట్టు భద్రతా అధికారులు వెల్లడించారు. కశ్మీర్‌లోకి చొరబడడం, ఈ ఉగ్రవాద కార్యకలాపాలను పర్యవేక్షించడం, కశ్మీర్‌లో ఘర్షణలు రేగేలా ఉగ్రవాదులకు దిశానిర్దేశం చేయడం వంటి వాటి కోసం పాక్‌ అజర్‌ను విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. జైషేప్రధాన కార్యాలయంలో అజర్, ఆయన సోదరులు, సంస్థకి చెందిన ఇతర సభ్యులు దాడులకు వ్యూహాలను రచిస్తున్నట్టు భారత్‌కు ఉప్పందింది. అజర్‌ను ఇటీవల భారత్‌ ఉగ్రవాది ప్రకటించిన విషయం తెలిసిందే.     

>
మరిన్ని వార్తలు