కరెన్సీ, మార్కెట్ల అస్థిరతకు అడ్డుకట్టవేయాలి

6 Sep, 2015 01:51 IST|Sakshi
కరెన్సీ, మార్కెట్ల అస్థిరతకు అడ్డుకట్టవేయాలి

 జీ-20 సమావేశంలో జైట్లీ
 అంకారా: కరెన్సీలోను, స్టాక్‌మార్కెట్లలోను తీవ్ర స్థాయి హెచ్చుతగ్గుల్ని నివారించడానికి అంతర్జాతీయ స్థాయి రక్షణ చర్యలు అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. దేశీయంగా తీసుకునే చర్యల వల్ల పలు ప్రతికూలతలు తలెత్తుతుంటాయని, వీటిని అధిగమించేందుకు ఐఎంఎఫ్ లాంటి సంస్థల నేతృత్వంలో తక్షణం ఫలితాన్నిచేలా, అత్యుత్తమ స్థాయిలో రూపొందించిన రక్షణాత్మక చర్యలు అవసరమని చెప్పారు. ఇందుకు సభ్యదేశాల మధ్య లిక్విడిటీ ఉండేలా వివిధ రకాల సర్దుబాట్లు ఉండాలన్నారు. ఇటీవల చైనా తన యువాన్ విలువను తగ్గించి కరెన్సీ వార్‌కు తెరతీసిన నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శనివారం టర్కీ రాజధాని అంకారాలో జీ-20 సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
 
  చైనా చర్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ‘‘వ్యక్తిగతంగానో, ప్రతిస్పందనగానో తాత్కాలికంగా తీసుకునే చర్యలు ప్రతికూలతల్ని కూడా తాత్కాలికంగానే ఆపగలవు. పూర్తిస్థాయి పరిష్కారాన్ని అందించలేవు. ఇది వివిధ దేశాల విధానాల్లో సమన్వయం ఉంటేనే సాధ్యం’’ అన్నారాయన. జీ 20 భేటీ నేపథ్యం గురించి మాట్లాడుతూ... అభివృద్ధి చెందిన దేశాలు వృద్ధాప్య సమస్యతో సతమతమౌతున్నాయని, భారత్‌లో మాత్రం యువశక్తే అత్యధికమన్నారు. సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్న దేశాలకు నైపుణ్యం కలిగిన సిబ్బందిని అందించి భారత్ వారి సమస్యను తీరుస్తుందని తెలియజేశారు. కాగా రేట్ల పెంపునకు అనువుగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు స్థిరమైన వృద్ధిని నమోదు చేయాలని జైట్లీతోపాటు జీ-20 సమావేశంలో పాల్గొన్న ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. అమెరికా ఫెడరల్ రిజర్వు రేట్లను పెంచుతుందనే ఊహాగానాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
 
 భారత్ మెరుగైన ఆర్థిక వ్యవస్థ: లగార్డే
 అంతర్జాతీయంగా ఉన్న మెరుగైన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కూడా ఒకటని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టిన్ లగార్డే తెలిపారు. అభివృద్ధి చెందిన, చైనా వంటి దేశాల్లో ఆర్థిక వృద్ధి మందగమన స్థితిలో ఉన్నప్పుడు కూడా భారత్ మంచి వృద్ధిని నమోదు చేస్తోందని చెప్పారు. వర్ధమాన దేశాల్లో వృద్ధి ఉందంటే అది భారత్‌లోనే అని తెలిపారు.
 
  కార్పొరేట్లకు కొత్త నియమావళి
 షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే చిన్న మదుపరుల ప్రయోజనాలను కాపాడటానికి, నిధుల సమీకరణకు స్టాక్‌మార్కెట్లను కీలక సాధనంగా మలచటానికి జీ-20, ఓఈసీడీ కలిసి... లిస్టెడ్ కంపెనీలు, నియంత్రణ సంస్థలు పాటించాల్సిన కార్పొరేట్ గవర్నెన్స్ మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేశాయి. ఈ మార్గదర్శకాలు భారత్‌తో సహా సభ్యదేశాలన్నిటికీ వర్తిస్తాయి. వీటిని అనుసరించి సెబీతో సహా నియంత్రణ సంస్థలన్నీ తమ నియంత్రణ విధానాలను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇనె ్వస్టర్లకు అన్ని విషయాలనూ తెలియజేయటంతో పాటు సీఈఓల జీతాలను నియంత్రణలో ఉంచటం... వివిధ  దేశాల్లోని నియంత్రణ సంస్థలు పరస్పరం సహకరించుకోవటం వంటివన్నీ తాజా నియమాల్లో ఉన్నాయి. ఓఈసీడీ సెక్రటరీ జనరల్ ఏంజెల్ గురియా, టర్కీ ఉపప్రధాని సెవ్‌డెట్ యిల్మాజ్ వీటిని విడుదల చేశారు. నిధుల సమీకరణలో క్యాపిటల్ మార్కెట్ల పాత్రను మరింత మెరుగు పరచటానికి జీ-20 ప్రయత్నిస్తోందని ఈ సందర్భంగా యిల్మాజ్ చెప్పారు. 2007-08 సంక్షోభం తరవాత నిధుల సేకరణ కష్టంగా మారిందని కూడా మంత్రి తెలియజేశారు.
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా