వాళ్లను క్షమిస్తున్నాం: జమాల్‌ ఖషోగ్గీ కుమారుడు

22 May, 2020 08:33 IST|Sakshi

రియాద్‌: తమ తండ్రిని హతమార్చిన వారిని క్షమిస్తున్నామని దివంగత సౌదీ జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్గీ కుమారులు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు.. ‘‘అమరుడైన జమాల్‌ ఖషోగ్గీ కుమారులమైన మేము.. మా నాన్నను హత్య చేసిన వారికి క్షమాభిక్ష పెడుతున్నట్లు ప్రకటన చేస్తున్నాం’’ అని ఖషోగ్గీ కుమారుడు సలా ఖషోగ్గీ ట్వీట్‌ చేశాడు. అయితే ఇందుకు సంబంధించిన చట్టపరమైన అంశాలపై అతడు స్పష్టతనివ్వలేదు. కాగా అమెరికా- సౌదీల పౌరసత్వం కలిగి ఉన్న ఖషోగ్గీ కుమారుడు పెద్ద కొడుకు సలా జమాల్‌ ఖషోగ్గీ ప్రస్తుతం సౌదీలో నివసిస్తున్నాడు. ఇక సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ విధానాలను విమర్శిస్తూ వాషింగ్టన్‌ పోస్ట్‌లో కథనాలు రాసిన ఖషోగ్గీ.. 2018 అక్టోబరులో టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ ఎంబసీలో దారుణ హత్యకు గురైన విషయం విదితమే. దీంతో అంతర్జాతీయ సమాజం సౌదీ యువరాజుపై తీవ్ర విమర్శలు గుప్పించింది.(ఖషోగ్గీ సంతానానికి సౌదీ ప్రభుత్వ భారీ చెల్లింపులు!)

ఈ నేపథ్యంలో అమెరికా సైతం ఖషోగ్గీ హత్యోందంతానికి సంబంధించిన నిజాలు వెలికితీసేందుకు తమ గూఢాచార సంస్థ (సెంట్రల్‌ ఇంటలిజిన్స్‌ ఏజెన్సీ)ను రంగంలోకి దింపింది. ఈ క్రమంలో రియాద్‌ నుంచి వచ్చిన 15 మంది ఏజెంట్లు ఖషోగ్గీని హతమార్చారని టర్కీ ఆరోపించింది. ఖషోగ్గీ అనుమానాస్పద మృతి ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపడంతో.. అతడి హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామంటూ సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ప్రకటించారు. ఈ క్రమంలో అనేక పరిణామాల అనంతరం ఈ కేసులో సౌదీ కోర్టు ఐదుగురికి మరణ శిక్ష విధించగా.. ముగ్గురు 24 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించనున్నారని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తెలిపారు.(ఖషోగ్గీ కేసులో ఐదుగురికి మరణశిక్ష)

ఈ నేపథ్యంలో న్యాయ వ్యవస్థ మీద తనకు పూర్తి విశ్వాసం ఉందన్న సలా.. దోషులు కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. తాజాగా దోషులకు క్షమాభిక్ష పెడుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్యర్యపరిచాడు. కాగా ఇస్తాంబుల్‌కు చెందిన పీహెచ్‌డీ స్కాలర్‌ హేటీస్‌ సెనీజ్‌ అనే మహిళను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే ఖషోగ్గీ హత్యకు గురయ్యారు. అయితే గతంలో ఇది వరకే ఆయనకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్య ద్వారా ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలిగారు. వీరిలో ముగ్గురికి అమెరికా పౌరసత్వం ఉంది.

>
మరిన్ని వార్తలు