‘జేమ్స్‌ బాండ్‌’ హీరో ఇకలేరు

24 May, 2017 01:28 IST|Sakshi
‘జేమ్స్‌ బాండ్‌’ హీరో ఇకలేరు

బెర్న్‌: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను అలరించిన ‘జేమ్స్‌ బాండ్‌’ చిత్రాల కథానాయకుడు, ప్రముఖ బ్రిటిష్‌ నటుడు రోజర్‌ మూర్‌(89) ఇకలేరు. కొంత కాలంగా కేన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన మంగళవారం స్విట్జర్లాండ్‌లో కన్నుమూశారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఆయన ట్వీటర్‌ ఖాతాలో వెల్లడించారు.

భారమైన హృదయంతో ఆయన మరణవార్తను తెలుపుతున్నామని పేర్కొన్నారు. మూర్‌ అంత్యక్రియలను ఆయన నివసించిన మొనాకోలో నిర్వహిస్తామని వె ల్లడించారు. మూర్‌ మృతిపై అభిమానులు, పలువురు హాలీవుడ్‌ ప్రముఖులు, సహచర నటులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాలీవుడ్‌ ప్రముఖులు రిషికపూర్, బొమన్‌ ఇరానీ తదితరులు కూడా సంతాపం తెలిపారు.

సైన్యం నుంచి సినిమాల దాకా..
అత్యధిక జేమ్స్‌ బాండ్‌ సినిమాల్లో నటించిన రికార్డు కొట్టేసిన మూర్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన మొత్తం ఏడు బాండ్‌ సినిమాల్లో నటించారు. మృదువుగా మాట్లాడుతూ, అనుమానంతో కనురెప్పలు పైకిలేపుతూ బాండ్‌ పాత్రలో ఒదిగిపోయారు. నిజ జీవితంలో తుపాకులంటే భయపడిపోయే మూర్‌ సినిమాల్లో కాల్పుల వీరుడిగా కనిపించక తప్పలేదు. వెండితెరపై బ్రిటిష్‌ గూఢచారి పాత్రలో పోరాటాల ను, రొమాన్స్‌ను పండించిన ఆయన నిజజీవితంలో సేవాకార్యక్రమాలతోనూ ఆకట్టుకున్నారు. 1991లో యూనిసెఫ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు.

1927లో లండన్‌లో జన్మించిన మూర్‌ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1946లో బ్రిటిష్‌ సైన్యంలో చేశారు. కొన్నాళ్లు జర్మనీలో పనిచేసి కెప్టెన్‌ హోదా పొందారు. తర్వాత రాయల్‌ అకాడమీ ఆఫ్‌ డ్రమాటిక్‌ ఆర్ట్స్‌లో శిక్షణ పొంది సినీరంగంలో ప్రవేశించారు. తొలుత సినిమాల్లో, టీవీ సీరియళ్లలో చిన్నచిన్న వేషాలు వేశారు. ‘ద సెయింట్‌’ స్పై థ్రిల్లర్‌ టీవీ ఎపిసోడ్లతో పేరు తెచ్చుకున్నారు. 1973–1985 మధ్య విడుదలైన జేమ్స్‌ బాండ్‌ సిరిస్‌లోని ‘లివ్‌ అండ్‌ లెట్‌ డై’, ‘ద మేన్‌ విత్‌ ద గోల్డెన్‌ గన్‌’, ‘ద స్పై హూ లవ్డ్‌ మి’, ‘మూన్‌రేకర్‌’, ‘ఫర్‌ యువర్‌ ఐస్‌ ఓన్లీ’, ‘ఆక్టోపస్సీ’, ‘ఎ వ్యూ టు కిల్‌’ సినిమాల్లో మూర్‌ నటించారు. ఆయనకు ముందు సీన్‌ కానరీ, జార్జ్‌ లాజన్‌బీలు జేమ్స్‌ బాండ్‌ పాత్రలు పోషించారు. బాండ్‌ సినిమాలపై రెండు పుస్తకాలు రాసిన మూర్‌ తన ఆత్మకథ ‘మై వర్డ్‌ ఈజ్‌ మై బాండ్‌’ను 2008లో వెలువరించారు.

భారత్‌తో అనుబంధం..
మూర్‌కు భారత్‌తో అనుబంధం ఉంది. ఆయన తల్లి లిలియన్‌ కోల్‌కతాలో జన్మించారు. మూర్‌ 1982లో ఆక్టోపస్సీ సినిమా  షూటింగ్‌ కోసం భారత్‌కు వచ్చారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఉదయ్‌పూర్‌లో చిత్రీకరించారు. ఈ సినిమాలో భారతీయ నటులు కబీర్‌ బేడీ, విజయ్‌ అమృత్‌రాజ్‌లు కూడా నటించారు. 2005లో అయోడైజ్డ్‌ ఉప్పు ప్రచారం కోసం మూర్‌ యూనిసెఫ్‌ రాయబారిగా మరోసారి భారత్‌కు వచ్చారు. వయసు పైబడినా ఇంకా యువకుడిలాగే కనిపిస్తుండటానికి కారణం ‘అయోడైజ్డ్‌ ఉప్పు’ అని సరదాగా చెప్పారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు