జపాన్‌ను వణికిస్తున్న ‘జనాభా’

10 May, 2018 12:48 IST|Sakshi

టోక్యో : ఏ దేశాభివృద్ధికైనా కీలకం యువశక్తి. దేశ జనాభాలో యువతరం ఎంత ఎక్కువగా ఉంటే ఆర్ధికాభివృద్ధి అంత ఎక్కువగా ఉంటుంది. ప్రసుత్తం ఈ విషయమే జపాన్‌ దేశంలో తీవ్ర ఆందోళనలు కల్గిస్తోంది. ఎందుకంటే గత 30 ఏళ్లుగా జపాన్‌ దేశ జనాభాలో యువతరం క్రమంగా తగ్గుతూ వస్తోంది. జపాన్‌ అంతర్గ వ్యవహారాలు, సమాచార మంత్రిత్వ శాఖ 2018, ఏప్రిల్‌ 1న విడుదల చేసిన నివేదిక ప్రకారం గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది యువతరం జనాభా 1,70,000 తగ్గింది. ఆందోళన కల్గించే మరో అంశం వృద్దుల జనాభా పెరగడం.

ప్రస్తుతం జపాన్‌ దేశ జనాభా 12.6 కోట్లు. కాగా వారిలో యువతరం(12 నుంచి 14 సంవత్సరాలలోపు) జనాభా కేవలం 32 లక్షలు మాత్రమే. అదే అమెరికాలో 18.9 శాతం, చైనాలో 16.8 శాతం, భారత దేశంలో 30.8 శాతం యువతరం జనాభా ఉండగా జపాన్‌లో మాత్రం 12.3 శాతం యువతరం జనాభా ఉన్నది. రోజురోజుకు తగ్గిపోతున్న జనాభాను పెంచడం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టింది. ప్రజలను ఎక్కువ మంది పిల్లల్ని కనమని ప్రోత్సాహించడమే కాక నగదు ప్రోత్సాహకాలను కూడా అందిస్తోంది. ఈ చర్యల ఫలితంగా 2015 వరకూ 1.4 శాతంగా ఉన్న సంతానోత్పత్తి 2025 నాటికి 1.8 శాతానికి పెరుగుతుందని అంచనా.

యువతరం - ఆర్థికాంశాలు
రోజురోజుకు తగ్గిపోతున్న జనాభా వల్ల ప్రస్తుతం ఉన్న 12.6 కోట్ల జనాభా, 2060 నాటికి 8.67 కోట్లకు పడిపోనున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. యువతరం జనాభా తగ్గడమే కాక వృద్ధుల సంఖ్య పెరుగుతండటంతో దేశ ఆర్థికవ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనున్నట్లు ప్రభుత్వ గణంకాలు వెల్లడిస్తున్నాయి. పనిచేసే వారు తగ్గినప్పుడు పన్నులు కట్టే వారి సంఖ్య కూడా తగ్గుతుంది. ఫలితంగా దేశ ఖజానాకు గండి పడుతుంది. పెరుగుతున్న వృద్ధులకు ఆరోగ్య సేవలు, పెన్షన్‌లు ఇవ్వడం ఇబ్బందిగా మారుతుంది.

ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ వలసదారుల విషయంలో జపాన్‌ వైఖరి మాత్రం మారటంలేదు. ఎక్కువ మొత్తంలో వలసదారులకు అనుమతిచ్చి, జనాభాను పెంచే ప్రయత్నాలు మాత్రం చేయట్లేదు. అమెరికాలో మొత్తం జనాభాలో 7 శాతం  విదేశీయుల సంతానం ఉండగా జపాన్‌లో మాత్రం వలసదారుల సతానం కేవలం 1.3 శాతం మాత్రమే. అంతేకాక తక్కువ జనాభా కారణంగా ఇక్కడ పనివారి కొరత కూడా తీవ్రంగా ఉంది. ఇందుకు లింగవివక్ష కూడా మరో కారణం.

జపాన్‌లో స్త్రీ, పురుషలకు చెల్లిస్తున్న వేతానాల్లో  25 శాతం వ్యత్యాసం ఉంది. అంతేకాక పిల్లల సంరక్షణ, లైంగిక వేధింపులు, అసమానతలు వంటి అంశాల వల్ల ఇప్పటికి కొన్నిరకాల విధులు నిర్వహించడానికి జపాన్‌ మహిళలు ముందుకురావడం లేదు. మానవ వనరుల కొరతను తగ్గించుకోవాలంటే 2050 నాటికి జపాన్‌ తన దేశ జనాభాలో, మూడొంతులు యువతరం ఉండేలా జాగ్రత్త పడాలి. అంతేకాక వేతనాలు పెంచడం, పని ప్రదేశాల్లో మహిళలకు మెరుగైన సౌకర్యాల కల్పన, భద్రతను పెంచడమే కాక వలసదారులను ఎక్కువ మొత్తంలో అనుమతిస్తే పరిస్థితిలో మార్పు వస్తుందని ప్రభుత్వ నివేదిక పేర్కొంది.

మరిన్ని వార్తలు