గంటల వ్యవధిలో 2 భూకంపాలు

11 May, 2019 08:45 IST|Sakshi

టోక్యో: కొన్ని గంటల వ్యవధిలో జపాన్‌ను రెండు భూకంపాలు వణికించాయి. స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం రాత్రి 10.43 నిమిషాలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.6గా నమోదైంది. ఆతర్వాత శుక్రవారం ఉదయం 7.43 నిమిషాలకు  మరోసారి భూమి కంపించింది. దీని తీవ్రత 6.3గా రికార్డయ్యింది. ఈ భూకంపం సముద్రంలో సంభవించడంతో సునామీ ముప్పు  ఉండొచ్చని  తొలుత భావించారు. 

అయితే దాని తీవ్రత ఆ స్థాయిలో లేదని అధికారులు వెల్లడించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక రాజధాని టోక్యోకు నైరుతి దిశగా సముద్రంలో 35 కిలోమీటర్ల లోతులో తొలి భూకంపం సంభవించిందని అమెరికాకు చెందిన జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. రెండో భూకంపం కూడా అదే ప్రాంతంలో 44 కిలోమీటర్ల లోతున సంభవించినట్లు ప్రకటించారు. దీని ప్రభావం తీరప్రాంత పట్టణం మియాజకీ–షీ పై పడింది. 2011లో రిక్టర్‌ స్కేల్‌పై 9.0 తీవ్రతతో సంభవించిన భూకంపంతో వచ్చిన సునామీ అపార ఆస్తి, ప్రాణ నష్టం కలిగించిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు