‘సైన్స్‌ పేరిట జపాన్‌ అతిపెద్ద క్రూర చర్య’

31 Mar, 2017 11:39 IST|Sakshi



టోక్యో: దాదాపు ఐదు నెలలపాటు భారీ తిమింగలాలను వేటాడిన జపాన్‌కు చెందిన ప్రత్యేక దళం శుక్రవారం తిరిగొచ్చింది. దాదాపు 333 తిమింగళాలను చంపినట్లు వారు తెలిపారు. షిమోనోసెకీ నగర ప్రభుత్వ వివరణ ప్రకారం అంటార్కిటిక్‌ సముద్రంలో ఈకోలాజికల్‌ సిస్టం ఎలా ఉందనే విషయాన్ని పరిశోధించేందుకు మొత్తం ఐదు పెద్ద పెద్ద ఓడల్లో అధ్యయన, వేట బృందాలను గత నవంబర్‌ నెలలో పంపించాయి. దీనికి వార్షిక అంటార్కిట్‌ హంట్‌ అని పేరు పెట్టింది. అయితే, పరిశోధన పేరిట వెళ్లిన ఈ బృందాలు అంటార్కిటిక్‌ సముద్రంలోని తిమింగళాలను చంపడం మొదలుపెట్టాయి.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 333 తిమింగళాలను నిర్ధాక్షిణ్యంగా చంపేశాయి. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జంతు ప్రేమికులు, పర్యావరణ వేత్తలు, ఇతర సామాజిక వేత్తలు, ప్రపంచ సంక్షేమ సంస్థల నుంచి జపాన్‌ చర్యలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినప్పటికీ ఆ వ్యతిరేకతను లెక్కచేయకుండా జపాన్‌ తన వేటను కొనసాగించింది. పేరుకు తాము ఈకోలాజికల్‌ సిస్టం తెలుసుకునేందుకే హంటింగ్‌ మొదలుపెట్టామని చెప్పినప్పటికీ ఇంటర్నేషనల్‌ కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌(ఐజేసీ) మాత్రం అదంతా జపాన్‌ చెబుతున్న కట్టుకథ అని, వారికి మాంసం కోసమే తిమింగళాలను వేటాడారని ఆరోపించింది.

సైన్స్‌ పేరు మీద జపాన్‌ చేస్తున్న అతిపెద్ద క్రూర చర్య అని అభివర్ణించింది. దీనిని అంతర్జాతీయ సమాజం ఏ మాత్రం గర్వించదని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఎలాంటి కారణాలు లేకుండానే తిమింగళాలు తమ ప్రాణాలు త్యాగం చేయాల్సి వస్తోందని వాపోయింది. ప్రస్తుతం ఆ తిమింగళాలను వేటాడి వచ్చిన వారికే జపాన్‌లోని షిమోనోసెకీ పోర్ట్‌ వద్ద ఘన స్వాగతం ఏర్పాటుచేసి అరగంటపాటు జోరువానలో పెద్ద పార్టీ చేసుకున్నారు.

మరిన్ని వార్తలు