దీవి మాయమైంది!

2 Nov, 2018 21:54 IST|Sakshi

టోక్యో: దీవి మాయమవడం ఏంటని ఏంటని అనుకుంటున్నారా? అవును నిజమే.. తమ దేశానికి చెందిన ఓ చిన్న దీవి కనిపించడం లేదని జపాన్‌ ఆందోళన చెందుతోంది. ఆ దీవి కొట్టుకుపోయిందా లేక మరేదైనా జరిగిందా అని తెలుసుకోవడానికి సర్వే నిర్వహించాలని భావిస్తోంది. ‘ఇసాంబి హనకిట కోజిమా’ అనే దీవిని 1987లో జపాన్‌ కోస్ట్‌గార్డ్‌ గుర్తించింది. అయితే దాని విస్తీర్ణం మాత్రం కనుక్కోలేకపోతున్నారు. ఈ మధ్య అది సముద్ర మట్టానికి 1.4 మీటర్ల మేర పెరగడంతో జపాన్‌ ఉత్తర హొకైడో దీవి నుంచి కూడా స్పష్టంగా కనిపించేది. కానీ హఠాత్తుగా ఇప్పుడా దీవి కనిపించడం లేదు. అది కొట్టుకుపోయి ఉండొచ్చని కోస్ట్‌గార్డ్‌ అధికారులు చెబుతున్నారు.

దీనివల్ల జపాన్‌ ప్రాదేశిక జలాల విస్తీర్ణం కాస్త తగ్గే అవకాశం ఉంది. కచ్చితమైన సర్వే నిర్వహిస్తేనే అది తెలుస్తుంది. పసిఫిక్‌ సముద్రంలోని మారుమూలల్లో ఉన్న తమ దీవులను రక్షించుకోవడానికి జపాన్‌ భారీగా ఖర్చు చేస్తోంది. ఇందులో కొన్ని దీవుల విషయంలో పొరుగు దేశాలైన చైనా, దక్షిణ కొరియాతో వివాదాలూ ఉన్నాయి. భారీ భూకంపాలు, సునామీలు సర్వసాధారణమైన జపాన్‌ తరచూ కొంత భూభాగాన్ని కోల్పోవడమో, కొత్తగా చేర్చుకోవడమో జరుగుతూనే ఉంది. 2015లో ఇలాగే 300 మీటర్ల భూభాగం సముద్రం నుంచి బయటపడి జపాన్‌లోని హొకైడో తీరంలో కలిసింది. 


 

మరిన్ని వార్తలు