దేవాలయంపై దావా వేసిన సన్యాసి

17 May, 2018 18:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

టోక్యో : బలవంతంగా తనతో ఎక్కువ సమయం పని చేయిస్తున్నారనే ఆరోపణతో ఏకంగా దేవాలయంపైనే దావా వేశాడో బౌద్ధ సన్యాసి. ఈ ఉదంతం జపాన్‌లోని టోక్యోలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జపాన్‌లోని మౌంట్‌కోయ మీద ఉన్న కోయాసన్‌ ఆలయం బౌద్ధులకు ప్రముఖమైంది. ఇక్కడికి భారీ సంఖ్యలో భక్తులు వస్తూవుంటారు. సన్యాసులుగా శిక్షణ పొందటానికి వచ్చిన వారు శిక్షణలో భాగంగా అక్కడ  సేవ చేయాల్సి ఉంటుంది.

శిక్షణా సమయాన్ని మించి ఎక్కువ సేపు పని చేయించారని సన్యాసి తరపు న్యాయవాది మీడియాకు తెలిపారు. కొన్నిసార్లు ఒక రోజులో 17 గంటల కంటే ఎక్కువ సమయం అతనితో పని చేయించారని పేర్కొన్నారు. సెలవు దినాల్లో కూడా తనతో ఎక్కువ సమయం పని చేయిస్తున్నారన్న కారణంగా అక్కడి కార్మిక సంఘం మద్దతు కూడగట్టుకున్నాడు సదరు సన్యాసి. బలవంతంగా తనతో ఎక్కువ పని చేయించినందుకు పరిహారంగా 70 వేల డాలర్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అదనపు శ్రమ జపాన్‌లో ప్రధాన సమస్యగా మారింది. 2017లో అదనపు శ్రమ కారణంగా 191 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. షింజో అబే ప్రభుత్వం అదనపు శ్రమను నివారించడానకి తగిన చర్యలు తీసుకున్నా అవి క్షేత్ర స్థాయిలో ఫలితాలను ఇవ్వడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. 

మరిన్ని వార్తలు