కరోనా ఎఫెక్ట్‌: సముద్ర తీరంలో 3711 మందిని ఆపేశారు

4 Feb, 2020 17:43 IST|Sakshi

టోక్యో: కరోనా వైరస్ పేరు వింటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. అయితే ఈ వైరస్‌ రోజు రోజుకు ఖండాలు, దేశాలను దాటేస్తోంది. తాజాగా కరోనా వైరస్ సోకి హాంకాంగ్‌లో ఓ వ్యక్తి మరణించాడు. చైనాలోని వుహాన్ నగరంలో మొదలైన వైరస్ ఇప్పుడు ప్రపంచంలోని 25 దేశాలను గజగజలాడిస్తోంది. కరోనావైరస్ బారిన పడి చైనాలో ఇప్పటి దాకా 425 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరో 20 వేల మందికి పైగా వైరస్ బారినపడి చికిత్స పొందుతున్నారు. దీంతో చైనా నుంచి ఎవరైనా తమ దేశంలోకి వస్తే ప్రపంచ దేశాలు హడలిపోతున్నాయి. ప్రయాణికులకు అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే అనుమతిస్తున్నారు. కరోనా వైరస్‌ ప్రభావం వల్ల సోమవారం అర్థరాత్రి నుంచి చైనా భూభాగంతో ఉన్న 13 సరిహద్దు క్రాసింగ్స్‌ను హాంకాంగ్ మూసివేసింది. పలు విమానయాన సంస్థలు కూడా చైనాకు సర్వీసులను నిలిపివేశాయి.

('కరోనాను అంతమొందించాకే ఊపిరి పీల్చుకుంటా')

తాజాగా.. జపాన్‌కు చెందిన డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ నౌకలో ప్రయాణిస్తున్న వారికి కూడా కరోనా వైరస్ బాధ తప్పలేదు. నౌకలో ప్రయాణిస్తున్న 3711 మందిలో ఓ వ్యక్తికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో జపాన్‌ ప్రభుత్వం యొకోహామా తీరంలోనే నౌకను ఆపేసింది. జపాన్‌ నిర్ణయంతో ప్రయాణికులంతా 24 గంటలపాటు నౌకలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రయాణికులందరికీ వైద్యపరీక్షలు పూర్తయ్యాక మాత్రమే అక్కడ నుంచి అనుమతిస్తామని అధికారులు చెప్తున్నారు. దీంతో అక్కడికి చేరుకున్న వైద్యులు నౌకలోని 80 ఏళ్ల ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు గుర్తించారు.  (కరోనా: ఇది హృదయ విదారక ఘటన!)

మరిన్ని వార్తలు