జపాన్ శాస్త్రవేత్తకు వైద్య నోబెల్

4 Oct, 2016 02:40 IST|Sakshi
జపాన్ శాస్త్రవేత్తకు వైద్య నోబెల్

* కణాల ఆత్మహత్యపై పరిశోధనకుగాను  ఒషుమీకి బహుమతి  
* ‘ఆటోఫేజీ’ ప్రక్రియ గుట్టువిప్పిన శాస్త్రవేత్త

స్టాక్‌హోమ్: కణాలు తమలోని దెబ్బతిన్న భాగాలను స్వీయ విధ్వంసం చేసుకుని, పునరుద్ధరించుకునే ప్రక్రియ(ఆటోఫేజీ) గుట్టు తేల్చిన జపాన్ శాస్త్రవేత్త యొషినోరీ ఒషుమీకి ఈ ఏడాది వైద్య శాస్త్ర నోబెల్ దక్కింది. కణాల ఆత్మహత్య లేదా కణాల స్వీయ విధ్వంసంగా పేర్కొనే ఈ ప్రక్రియలో లోపం వల్లే మనలో వృద్ధాప్యం వస్తుందని, కణాలు దెబ్బతిని పార్కిన్‌సన్స్, మధుమేహం, కేన్సర్ వంటి వ్యాధులు వస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు.

టోక్యో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఒషుమి వయసు 71 ఏళ్లు. డిసెంబర్ 10న జరిగే కార్యక్రమంలో నోబెల్ అవార్డుతో పాటు 8 మిలియన్ల స్వీడిష్ క్రోనార్లు (రూ.6.23 కోట్లు) బహుమతిగా అందుకోనున్నారు. గతేడాది వైద్య నోబెల్‌ను సూక్ష్మజీవుల ద్వారా వచ్చే వ్యాధులను ఎదుర్కొనే చికిత్సలను అభివృద్ధి చేసిన విలియం కాంప్‌బెల్(అమెరికా), సతోషి ఒముర(జపాన్), టు యూయూ(చైనా)లు సంయుక్తంగా అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా నోబెల్ గెలుచుకున్న ఒషుమీతో జపాన్ మొత్తంగా 23వ నోబెల్ గెలుచుకుంది.

వైద్య రంగంలో ఆ దేశానికి ఇది 6వ నోబెల్ బహుమతి కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఒషుమీ మాట్లాడుతూ.. ‘‘ఇతరులు చేయాలనుకోని పనులు చేయాలనేది నా ఆలోచన. ఆటోఫేజీ చాలా ఆసక్తికరమైన అంశం. అంతా మొదలయ్యేది దానివద్దే. కానీ గతంలో ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అందరి దృష్టీ దానిపై ఉంది. నోబెల్ రావడం ఓ పరిశోధకుడికి అత్యుత్తమ గౌరవం’ అని పేర్కొన్నారు.
 
ఏమిటీ ఆటోఫేజీ.?
చేతికున్న వాచీ పాడైతే మరమ్మతు చేయిస్తాం. లేకపోతే కొత్తది కొనుక్కుంటాం. మరి మన శరీర కణాలు తమ లోపలి భాగాలు పాడైతే ఏం చేస్తాయో తెలుసా? వాటిని ఎంచక్కా ప్యాక్ చేసి.. కణంలోనే ఉండే రీసైక్లింగ్ విభాగానికి పంపేస్తాయి. లైసోసోమ్ అని పిలిచే ఈ భాగంలోకి వెళ్లే కణ భాగాలు తర్వాత క్రమేపీ నాశనమవుతాయి.  దీనినే ‘ఆటోఫేజీ’ అంటారు. దీని అనంతరం ఆ కణాంగాల పునరుద్ధరణ జరుగుతుంది.

ఆటోఫేజీ గురించి 1950ల్లోనే శాస్త్రవేత్తలకు తెలుసు. కానీ దీని వెనుక ఉన్న జన్యువులేమిటి, ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందన్నది మాత్రం 1990లలో జపాన్ శాస్త్రవేత్త యొషినోరీ ఒషుమీ ప్రయోగాల వల్ల  అర్థమైంది. ఫలితంగానే ఉపవాసం శరీరానికి చేసే మేలేమిటో తెలిసింది. ఇన్ఫెక్షన్ సోకితే శరీరం ఎలా స్పందిస్తుందో అర్థమైంది. ఈ ఆటోఫేజీ కారక జన్యువుల్లో వచ్చే మార్పులు కేన్సర్ వంటి వ్యాధులకు ఎలా దారితీస్తాయో కూడా వెల్లడైంది.
 
కణాల ఆత్మహత్య.. ఆటోఫేజీ అంటే గ్రీకు భాషలో తనను తాను తినేయడమని అర్థం (ఆటో అంటే స్వయంగా, ఫేజియన్ అంటే తినేయడం). కణాల్లో వేర్వేరు క్రియల కోసం ప్రత్యేకమైన గదుల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని ఆర్గనెల్లే అని పిలుస్తారు. అయితే కణభాగాలు కొన్ని లైసోసోమ్‌లో ఉండడాన్ని గమనించిన శాస్త్రవేత్తలు దీనికి కారణమేమిటని పరిశోధన చేశారు. కణంలోని పాడైన భాగాలు ప్రొటీన్లు, కొన్ని రకాల ఆర్గనెల్లేలు, త్వచాల తొడుగులతో వచ్చి లైసోసోమ్‌లో చేరుతున్నట్లు గుర్తించారు.

లైసోసోమ్ తనలోని ప్రొటీన్లు, ఎంజైమ్‌లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వుల సహాయంతో ఆ భాగాలు నశించిపోయేలా చేస్తున్నట్లు తేల్చారు. 1974లో నోబెల్ పొందిన క్రిస్టియన్ డూవ్ ఈ ప్రక్రియకు ఆటోఫేజీ అని పేరుపెట్టారు. దీంతో కణభాగాలను మోసుకొచ్చే సంచులను ఆటోఫేజసోమ్స్ అని పిలుస్తున్నారు.
 
తొలుత ఈస్ట్‌పై ప్రయోగాలు..: ఆటోఫేజీ ప్రక్రియ గుట్టు ఛేదించేందుకు చాలామంది శాస్త్రవేత్తలు ప్రయత్నించినా విజయం సాధించలేకపోయారు. చివరికి ఒషుమీ 1998లో ఈస్ట్ కణాల్లో లైసోసోమ్ మాదిరిగానే పనిచేసే ఓ ఆర్గనెల్లేపై ప్రయోగాలు చేశారు. కొన్ని ప్రయోగాల ద్వారా ఈస్ట్ కణాల్లో ఆటోఫేజీ ప్రక్రియ జరుగుతోందని నిర్ధారించుకున్న ఒషుమీ... తర్వాత జన్యుమార్పులను గుర్తించే ప్రయోగాలతో ఆటోఫేజీకి కారణమైన కీలక జన్యువులను గుర్తించారు. మరింత పరిశోధన ద్వారా ఈ జన్యువులు ఉత్పత్తి చేసే ప్రొటీన్లు ఆటోఫేజసోమ్స్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయో గుర్తించారు. ఇలాంటి ప్రక్రియే మానవుల్లోనూ ఉన్నట్లు తర్వాత వెల్లడైంది.
 
విస్తృతంగా పరిశోధనలు..: ఆటోఫేజీ ప్రక్రియ గర్భంలో పిండం అభివృద్ధి చెందేందుకు, మూలకణాలు వేర్వేరు కణాలుగా అభివృద్ధి చెందేందుకూ ఉపయోగపడుతుందని గుర్తించారు. పాడైపోయిన ప్రొటీన్లు, ఆర్గనెల్లేలను వదిలించుకునేందుకు, ఇన్ఫెక్షన్లకు ఎలా స్పందించాలన్నది కూడా ఆటోఫేజీ ద్వారా తెలుస్తోందని నిర్ధారించారు. ఈ ప్రక్రియ సక్రమంగా జరగకపోవడం వల్లే వయోధికుల్లో టైప్-2 మధుమేహం, పార్కిన్‌సన్స్ వంటి వ్యాధులు ఏర్పడతాయని తేల్చారు. కేన్సర్, జన్యు వ్యాధులకూ ఆటోఫేజీతో సంబంధమున్నట్లు భావించి.. ఆ దిశగా పరిశోధనలు చేస్తున్నారు. ఆటోఫేజీని ప్రభావితం చేయడం ద్వారా వ్యాధులకు సమర్థమైన చికిత్సలను అందించేందుకు పలు సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు