ఉత్తర కొరియాపై జపాన్ సీరియస్

3 Aug, 2016 13:03 IST|Sakshi
ఉత్తర కొరియాపై జపాన్ సీరియస్
టోక్యో: ఉత్తర కొరియా తన దుందుడుకు చర్యలను కొనసాగిస్తూనే ఉంది. బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఆ దేశం.. వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఉత్తరకొరియా పరిక్షించిన క్షిపణి ఒకటి జపాన్ సమీపంలోని సముద్రజలాల్లో పడింది. దీంతో.. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఇలా ప్రయోగాలు నిర్వహించడం ఏ మాత్రం సహేతుకం కాదంటూ ఉత్తర కొరియాపై జపాన్ మండిపడుతోంది. తమ ప్రాదేశిక జలాల్లోని 'ఎక్స్క్లూజీవ్ ఎకనమిక్ జోన్'(ఈఈజెడ్) పరిధిలో క్షిపణి పడిందని జపాన్ వెల్లడించింది. ఇది తమ దేశ భద్రతకు తీవ్రమైన హాని కలిగించే చర్య అని జపాన్ ప్రధాని షింజో అబె అన్నారు.
 
జపాన్ ప్రభుత్వ సీనియర్ అధికారి యొషిహిడే సుగా మాట్లాడుతూ.. ఉత్తర కొరియా చర్య ఎయిర్ క్రాఫ్ట్లు, షిప్పులకు హాని కలిగించేలా ఉందని అన్నారు. జపాన్కు 200 కిలోమీటర్ల దూరంలోని సముద్రజలాల్లో క్షిపణి పడినట్లు తెలుస్తోంది. దక్షిణ కొరియా, అమెరికా భారీ స్థాయిలో సంయుక్త మిలటరీ ఎక్సర్సైజ్ నిర్వహించనున్న నేపథ్యంలో జరిగిన ఈ క్షిపణి పరీక్షను అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిబంధనలను ఉత్తరకొరియా ఉల్లంఘిచిందని అమెరికా పేర్కొంది.
 
>
మరిన్ని వార్తలు