ఐదువేల సంవత్సరాలు కలిసి బతికారు

1 Apr, 2016 10:28 IST|Sakshi
ఐదువేల సంవత్సరాలు కలిసి బతికారు

టోక్యో: గత చరిత్ర మొత్తం కూడా సంఘర్షణలతో నిండుకొని రక్తపు సిరాతో రాయబడిందని చెప్తుంటారు. బలంకలవాడు బలహీనుడిని చిత్రహింసలు పెట్టి పెత్తనం చెలాయిస్తూ తన కుటుంబాన్ని సమాజాన్ని ప్రభావితం చేసే వ్యవస్థగా తయారుచేసుకున్నాడని కూడా చెప్తారు. ఈ క్రమంలోనే సమాజ నిర్మాణంలో, సంస్కృతి, సంప్రదాయాల్లో విభిన్న మార్పులు రావడం జరిగిందని, సమాజాల విచ్ఛిన్నతకు ప్రధాన కారణం యుద్ధాలవంటి ఘర్షణలే అని చెప్తారు.

కానీ, ఒక్కసారి జపాన్లో క్రీస్తు పూర్వం కిందటి చరిత్ర చూస్తే మాత్రం పై విషయాలకు పూర్తి భిన్నం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేటగాళ్లంతా కూడా ఒకే సమాజంగా రూపొంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదువేల సంవత్సరాలపాటు కలిసి కట్టుగా జీవించారని ఓ అధ్యయనం వెల్లడిస్తోంది. జపాన్కు చెందిన పురాతత్వ శాస్త్రవేత్తలు క్రీస్తు పూర్వం 14,500 నుంచి క్రీస్తు పూర్వం 300 వరకు ఉన్న చరిత్రను పరిశీలించారు. అందులో భాగంగా ఆ మధ్య కాలంలో జీవించి చనిపోయినవారి అవశేషాలను పరిశీలించారు.

ఇందులో ముఖ్యంగా వారి ఎముకలపై ప్రశ్నలు జరపగా ఏ ఒక్కరికీ కూడా గాయాలు అయినట్లు బయటపడలేదు. ఇలా దాదాపు ఐదు వేల సంవత్సరాల కాలంలో లభించిన ఎముకలను పరిశీలించగా ఇలాంటి ఆధారాలే కనిపించాయి. ఆటవిక జీవితాన్ని అనుభవిస్తూ వేటపై ఆధారపడి జీవించే అప్పటి వారే ఎలాంటి ఘర్షణలకు దిగకుండా హాయిగా బతికేశారని జపాన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతోపాటు అప్పట్లోనే సమాజ సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా వారు జీవించారని కూడా చెప్తున్నారు.

మరిన్ని వార్తలు