ఆస్పత్రిలో నోబెల్‌ గ్రహీత.. భార్య దుర్మరణం

15 Mar, 2018 09:48 IST|Sakshi
రసాయన శాస్త్రంలో నోబెల్‌ అందుకున్న జపాన్‌ శాస్త్రవేత్త ఐఈచీ నెగిషి (ఫైల్‌ ఫొటో)

చికాగో : నోబెల్‌ బహుమతి గ్రహీతకు ఊహించని కష్టం ఎదురైంది. వృద్ధాప్యంలో ఉన్న ఆయన జీవితంలో అనుకోకుండా చోటుచేసుకున్న ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చింది. ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరిన జపాన్‌ నోబెల్‌ బహుమతి గ్రహీత ఐఈచీ నెగిషి (82) ఆయన భార్య  సుమైర్‌ నెగిషి (80) ఎయిర్‌పోర్ట్‌కు ఇల్లినాయిస్‌ ప్రాంతంలోని ఓ గ్రామం మీదుగా వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆయన భార్య చనిపోగా.. ఆయన మాత్రం గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కెమిస్ట్రీ విభాగంలో నోబెల్‌ పొందిన ఆయన ప్రస్తుతం అదే విభాగంలో పర్‌డ్యూ యూనివర్సిటీలో పాఠాలు బోధిస్తున్నారు. అయితే, తొలుత సోమవారం నుంచి ఆయన ఆచూకీ కనిపించలేదు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించి గాలించడం మొదలుపెట్టారు.

ఆయన కుటుంబం కోసం తీవ్రంగా శోధించిన పోలీసులకు ఓ అడ్వాన్సడ్‌ డిస్పోజల్‌ కంపెనీకి చెందిన ఆర్కార్డ్‌ హిల్స్‌ ల్యాండ్‌ వద్ద రోడ్డుపై గాయాలతో సాయం కోసం అటు ఇటు తిరుగుతున్న ఐఈచీ కనిపించారు. హుటాహుటిన ఆయనను సమీపించిన పోలీసులు వారి కారు రోడ్డుపై ఉన్న పెద్ద కందకంలోకి వెళ్లి ప్రమాదనికి గురైనట్లు గుర్తించారు. ఆయన కారు వెనుక భాగంలో సుమైర్‌ నెగిషి చనిపోయి ఉన్నారు. దీంతో ఐఈచీని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మాత్రం పూర్తి వివరాలు తెలియజేయలేదు. దీని వెనుక ఏదైనా కుట్ర ఉందేమో, ఎవరైనా వారిని హత్య చేయాలని ఇలా చేశారేమోనని కూడా అనుమానిస్తున్నారు. ఎందుకంటే వారు వెళ్లాల్సిన రాక్‌ఫోర్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ ఇక 13 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 2010లో ఆయన మరో ఇద్దరితో కలిసి నోబెల్‌ అవార్డు అందుకున్నారు. జపాన్‌ వాసి అయిన ఐఈచీ 1960లో ఓ స్కాలర్‌షిప్‌పై అమెరికా వచ్చి చదువుకొని అక్కడే అధ్యాపకుడిగా స్థిరపడ్డారు.

మరిన్ని వార్తలు