'అమెరికాపై దాడి జరిగితే సోనీ టీవీలో చూస్తారు'

7 Aug, 2016 01:47 IST|Sakshi
'అమెరికాపై దాడి జరిగితే సోనీ టీవీలో చూస్తారు'

వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అడ్డుఅదుపు లేకుండా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. చైనాతో సహా పలు దేశాలపై విమర్శలు చేసిన ఆయన తాజాగా జపాన్ పై విరుచుకుపడ్డారు. అమెరికాపై దాడి జరిగితే జపాన్ పండగ చేసుకుంటుందని వ్యాఖ్యానించారు. ఐయొవాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ... 'నాటో'కు ఆర్థికంగా ఎటువంటి చెల్లింపులు లేనప్పటికీ జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలు అమెరికా రక్షణ పొందుగలుగుతున్నాయని అన్నారు.

'జపాన్ ను మనం ఎంతగా కాచుకుంటున్నామో తెలుసా. ఒకవేళ జపాన్ పై దాడి జరిగితే అమెరికా మొత్తం సైన్యాన్ని ఉపయోగించి ఆ దేశానికి అండగా నిలుస్తాం. మనమీద దాడి జరిగితే జపాన్ ఎటువంటి సాయం అందించదు. జపనీయులు ఇంట్లో కూర్చుని సోనీ టీవీ చూస్తార'ని ట్రంప్ వ్యాఖ్యానించారు.

జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, సౌదీ అరేబియా ఇతర దేశాలను అమెరికా కాపాడుతోందని.. ఇందుకు ఆ దేశాలు ఎటువంటి పైకం చెల్లించడం లేదన్నారు. ఈ పరిస్థితి మారాలన్నారు. ఉత్తర కొరియా నుంచి పొంచివున్న ముపును ఎదుర్కొనేందుకు జపాన్, దక్షిణ కొరియా సిద్ధంగా ఉండాలని సూచించారు.

>
మరిన్ని వార్తలు