మేం హై హీల్స్‌ వేసుకోం!

5 Jun, 2019 19:27 IST|Sakshi

టోక్యో : పని చేసే ప్రదేశాల్లో హై హీల్స్‌ వేసుకోవటం కుదరదని జపనీస్‌ మహిళలు తెగేసి చెబుతున్నారు. పని ప్రదేశాల్లో హై హీల్స్‌ తప్పనిసరన్న నిబంధనను రద్దు చేయాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. హై హీల్స్‌ వేసుకోవటం అన్నది ఉద్యోగాలకోసం అన్వేషించే, ఉద్యోగాలు చేసుకునే మహిళలకు ఇబ్బందిగా మారిందని వారు చెబుతున్నారు. జపనీస్‌ నటి, ఫ్రీలాన్స్‌ రచయిత యూమి ఇసికావా ఇందుకోసం ఓ ఉద్యమాన్ని సైతం చేపట్టింది. జపాన్‌ శ్రామిక శాఖ అధికారులతో చర్చల అనంతరం నటి ఇషికావా మీడియాతో మాట్లాడుతూ.. పని ప్రదేశాల్లో మహిళలను హై హీల్స్‌ వేసుకోమనటం లైంగిక వివక్షేనని, వేధింపులకు గురి చేయటమేనని ఆమె పేర్కొన్నారు. యాజమాన్యం ఏ విధంగా చట్టాల్ని తుంగలో తొక్కుతోందో అధికారులకు వివరించామని చెప్పారు. ఈ మేరకు మంగళవారం నాడు ప్రభుత్వానికి పిటిషన్‌ అందజేశామని తెలిపారు.

మహిళల ఇబ్బందులపై జపాన్‌ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి.  కొన్నేళ్ల క్రితం లండన్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న ఓ మహిళ హై హీల్స్ ధరించటానికి నిరాకరించటంతో ఆమెను ఇంటికి పంపించారు. గతంలో సినీ నటి ఎమ్మా థాంప్సన్.. గోల్డెన్ గ్లోబ్స్ కార్యక్రమంలో తాను తొడుక్కున్న చాలా ఎత్తు మడమల లబోటిన్ హీల్స్‌ వల్ల చాలా నొప్పి వస్తోందంటూ వాటిని తీసివేసి పతాక శీర్షికలకెక్కిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు