జపాన్‌లో శవాల హోటల్‌

1 May, 2016 11:21 IST|Sakshi
జపాన్‌లో శవాల హోటల్‌

టోక్యో: జపాన్‌లో వృద్ధతరం మరణాలు రోజురోజుకు పెరిగిపోతుండడంతో శవాలను తగులబెట్టేందుకు క్రిమిటోరియంలో క్యూలు పెరిగిపోతున్నాయి. ఒక్కోసారి శవాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు నాలుగు రోజులపాటు కూడా నిరీక్షించాల్సి వస్తోంది. అలాంటప్పుడు శవాలను భద్రపరిచేందుకు క్రిమిటోరియంలో చోటు కూడా లేదు.

మరి ఎలా? ఇలాంటి అవసరాలను తీర్చడం కోసమే జపాన్‌లోని కవసాకి నగరంలో ఓ శవాల హోటల్‌ (కార్ప్స్‌ హోటల్‌) వెలిసింది. కవసాకి నగరంలోని క్రిమిటోరియం సమీపంలోనే ‘సౌసౌ’ అనే పేరుతో ఆ శవాల హోటల్‌ ఉంది. అందులో ఒక్క రాత్రికి ఒక్క శవానికి 5,800 రూపాయల చొప్పున వసూలు చేస్తారు. హోటల్‌కు కూడా డిమాండ్‌ పెరుగుతుండడంతో నాలుగు రోజులకు మించి ఓ శవాన్ని ఉంచుకోవడం లేదు. నాలుగు రోజుల్లో అంత్యక్రియలు కూడా ముగుస్తున్నాయికనుక ప్రజలు పెద్దగా ఇబ్బంది పడడం లేదు.

ఈ హోటల్‌లో శవ పేటకలను భద్రపర్చేందుకు ఫ్రీజర్లు కాకుండా ఏకంగా ఏసీ గదులను ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వచ్చి తమకు సంబంధించిన శవాలను రోజుకు ఎన్నిసార్లయినా వచ్చి చూసుకోవచ్చు. అక్కడే నిద్రిచ్చే వసతిని మాత్రం కుటుంబ సభ్యులకు స్థలాభావం వల్ల హోటల్‌ యజమానులు కల్పించడం లేదు. డిమాండ్‌కు తగ్గట్టుగా మరిన్ని క్రిమిటోరియంలు నిర్మించేందుకు కవసాకిలో స్థలం లేదని శవాల హోటల్‌ యజమాని హిసావో టేక్‌గిషి తెలిపారు.

జపాన్‌లో వద్ధాప్యం కారణంగా ఏటా 20వేల మంది మరణిస్తున్నారు. ఈ సంఖ్య 2040 నాటికి 17లక్షలకు పెరిగుతుందని ప్రభుత్వ అంచనాలు తెలియజేస్తున్నాయి. శవాలకున్న డిమాండ్‌ను దష్టిలో పెట్టుకొని తాను త్వరలోనే ఇతర నగరాల్లో కూడా శవాల హోటళ్లను ప్రారంభించాలనుకుంటున్నట్లు సౌసౌ హోటల్‌ యజమాని తెలిపారు. ఇప్పటికే ఆ హోటల్‌ అక్కడున్నందుకు ఇరుగుపొరుగున నివసిస్తున్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వారు ప్లా కార్డులు ధరించి ధర్నా కూడా చేశారు.

మరిన్ని వార్తలు