రాచరికం.. తృణప్రాయం

31 Oct, 2018 01:34 IST|Sakshi

సామాన్యుడ్ని పెళ్లాడిన జపాన్‌ యువరాణి

టోక్యో: సామాన్యుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న జపాన్‌ యువరాణి అయాకో తన రాచరిక హోదాను వదులుకుంది. 28 ఏళ్ల అయాకో ఒక షిప్పింగ్‌ సంస్థలో పనిచేసే 32 ఏళ్ల మొరియాను సోమవారం పెళ్లాడింది. ప్రేమ కోసం రాచరిక హోదా, ఇతర భోగభాగ్యాలను తృణప్రాయంగా వదిలిపెట్టిన అయాకోకు జపాన్‌ ప్రభుత్వం జీవన భృతి కింద సుమారు రూ.7 కోట్లు చెల్లించనుంది.

జపాన్‌ రాజు అకిహిటో కజిన్‌ అయిన దివంగత టాకాముడో కూతురే అయాకో. జపాన్‌ రాచరిక సంప్రదాయాల ప్రకారం..బయటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే రాకుమారి అన్ని హోదాలు, గౌరవాల్ని కోల్పోతుంది. రాకుమారుడికి ఈ నిబంధనలు వర్తించవు. జపాన్‌ రాజకుటుంబంలో అయాకో లాంటి వివాహం మరొకటి జరగనుంది. అకిహిటో పెద్ద మనవరాలు మాకో(26) ఓ సామాన్యుడిని ప్రేమించింది.  

జపాన్‌లో ఇలా.. బ్రిటన్‌లో అలా..
బ్రిటన్‌ రాజవంశీయులు పురుషులైనా, మహిళలైనా పరాయివారిని వివాహమాడితే రాచరిక హోదాను కోల్పోరు. ఇటీవల జరిగిన ప్రిన్స్‌ హ్యారీ–మేఘన్, ప్రిన్సెస్‌ యూజినీ–జాక్‌ బ్రూక్‌బ్యాంక్‌ల వివాహాలే ఇందుకు నిదర్శనం. జపాన్‌ సింహాసనం అధిష్టించడానికి మహిళలు అనర్హులు. బ్రిటన్‌లో ఈ విషయంలో లింగబేధం లేదు. అందుకే ఇప్పటి వరకు ఎలిజబెత్‌–2తో సహా ఆరుగురు రాణులు పాలనా పగ్గాలు చేపట్టారు.

మరిన్ని వార్తలు