ప్రపంచ కుబేరుడి ‘విడాకుల ఖరీదు’ తెలిస్తే!

11 Jan, 2019 11:55 IST|Sakshi
భార్యతో జెఫ్‌ బెజోస్‌

పాతికేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ భార్య మెకాంజీ నుంచి విడాకులు తీసుకున్నానంటూ అమెజాన్‌ సీఈఓ, ప్రపంచ కుబేరుడు జెఫ్‌ బెజోస్‌ షాకింగ్‌ న్యూస్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రముఖ టీవీ యాంకర్‌తో ప్రేమలో పడిన కారణంగానే బెజోస్‌ తన భార్య నుంచి విడిపోతున్నారంటూ రూమర్లు ప్రచారం అవుతున్నాయి కూడా. ఈ నేపథ్యంలో.. ప్రపంచలోనే అత్యంత ధనవంతుడైన  బెజోస్‌ ప్రస్తుత సంపాదన 137 బిలియన్‌ డాలర్లని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కాగా భరణం రూపంలో ఆయన.. తన భార్యకు సుమారు 60-70 బిలియన్‌ డాలర్లు(రూ. 42,38,10,00,00,000- నాలుగున్నర లక్షల కోట్లు) చెల్లించనున్నారట. దీంతో బెజోస్‌ సంపద సగానికి తగ్గనుంది. ఈ క్రమంలో విడాకుల అనంతరం... ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలైన మహిళగా మెకాంజీ నిలవనున్నారట.

కాగా పాతికేళ్లపాటు భార్యభర్తలుగా ఎంతో సంతోషంగా జీవించామనీ, విడాకులు తీసుకుంటున్నప్పటికీ స్నేహితులుగా కొనసాగుతామని బెజోస్‌ తెలిపారు. పరస్పర ఆమోదంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, అయితే ఉమ్మడి వెంచర్లు, ప్రాజెక్టుల్లో భాగస్వాములుగా కొనసాగుతామని సంయుక్త ప్రకనటలో తెలిపారు.

ఇక రచయిత్రి అయిన మెకెంజీ (48) న్యూయార్క్‌లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లిన సమయంలో 1993లో తొలిసారిగా బెజోస్‌ను కలుసుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆరునెలల తరువాత అదే ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంటకు నలుగురు పిల్లలు ఉన్నారు. మెకెంజీ రెండు నవలలు కూడా రాశారు. భర్తే  తన రచనలకు, మొదటి బెస్ట్‌ రీడర్‌ అని ఆమె చెప్పేవారు. రచనా వ్యాసంగంతోపాటు  మెకంజీ  బైస్టాండర్‌ రివల్యూషన్‌  (వేధింపులకు వ్యతిరేకంగా) అనే సంస్థను 2014లో ఏర్పాటు చేశారు. 1994లో ఆన్‌లైన్ బుక్సెల్లర్‌గా ఏర్పాటైన అమెజాన్‌ ఆ తర్వాత అంచలంచెలుగా ఎదిగి.. ప్రపంచ దిగ్గజ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. అమెజాన్ సంస్థను ఏర్పాటు చేసిన తొలినాళ్లలో మెకంజీ తన బిజినెస్‌కు ఎంతో సహకారం అందించారని పలు సందర్భాల్లో జెఫ్ బిజోస్ గుర్తు చేసుకున్నారు. ఇటీవలే అమెజాన్‌ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించిన సంగతి తెలిసిందే.

జెఫ్‌ బెజోస్‌.. మెకాంజీకి చెల్లించనున్న భారీ భరణం నేపథ్యంలో మరికొంత మంది సెలబ్రిటీల విడాకుల గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో భార్యలకు అత్యధిక భరణం చెల్లించిన భర్తలు, ఖరీదైనా విడాకుల గురించి మనం కూడా ఓసారి తెలుసుకుందాం.

దిమిత్రి రైబోలోలెవ్‌- ఎలీనా రైబోలోలెవ్
బెజోస్‌ కంటే ముందు ఈ జంట విడాకులే అత్యంత ఖరీదైన విడాకులుగా నిలిచాయి. 2014లో వీరు విడిపోయారు. ఈ క్రమంలో బిలియనీర్‌ దిమిత్రి తన భార్య ఎలీనాకు 4.5 బిలియన్‌ డాలర్లు భరణంగా చెల్లించారు.

ఎలిక్‌ వైల్డిస్టీన్‌- జోక్లిన్‌ వైల్డిస్టీన్
ఫ్రెంచ్‌లో జన్మించిన అమెరికన్‌ వ్యాపారవేత్త ఎలిక్‌ 1999లో తన భార్యకు విడాకులు ఇచ్చారు. ఇందులో భాగంగా 3.8 బిలియన్‌ డాలర్లు భరణం రూపంలో చెల్లించారు.

రూపెర్ట్‌ మర్దోక్‌- అన్నా మర్దోక్‌ మన్‌
అమెరికన్‌ మీడియా మెఘల్‌ రూపెర్ట్‌ 31 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ 1999లో తన భార్య అన్నా నుంచి విడిపోయారు. ఈ సందర్భంగా ఆమెకు 2.6 బిలియన్‌  డాలర్లు భరణంగా ఇచ్చారు.

బెర్నీ ఎలెస్టోన్‌- స్లావికా ఎలెస్టోన్‌
ప్రపంచంలోనే ఖరీదైన విడాకులు పొందిన ఐదో జంటగా బెర్నీ-స్లావికా జంట నిలిచింది. 2009లో విడిపోయిన ఈ జంట విడాకుల ఖరీదు- 1.2 బిలియన్‌ డాలర్లు.

స్టీవ్‌ వీన్‌- ఎలైన్‌ వీన్‌
కాసినో మొఘల్‌ స్టీవ్‌ వీన్‌ తన భార్య నుంచి విడిపోయే క్రమంలో సుమారు 1 బిలియన్‌ డాలర్ల భరణం చెల్లించారు. ఎంతోమంది మహిళలను లైంగికంగా వేధించారనే ఆరోపణలు స్టీవ్‌ వీన్‌పై రావడంతో ఆయన భార్య విడాకులు కోరినట్లుగా అప్పట్లో వార్తలు ప్రచారమయ్యాయి.

స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌- ఎమీ ఇర్వింగ్‌
ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ 1989లో తన భార్య ఎమీ నుంచి విడిపోయారు. ఆ సమయంలో 100 మిలియన్‌ డాలర్లు ఎమీకి భరణంగా చెల్లించారు.

మరిన్ని వార్తలు