సినీ రంగంలోకి ‘అమెజాన్’

28 Dec, 2015 20:41 IST|Sakshi
సినీ రంగంలోకి ‘అమెజాన్’

బెర్లిన్: కొత్తగా  సినిమా పరిశ్రమలోకి అడుగు పెడుతున్నామని, ఏడాదికి 16 ఫీచర్ సినిమాలు తీస్తామని, ఆస్కార్ అవార్డును సాధించడం తమ లక్ష్యమని ఆన్‌లైన్ వ్యాపారంలో దూసుకుపోతున్న ప్రపంచ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ జర్మనీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదివారం వెల్లడించారు. కామెడీ టీవీ సిరిస్ ద్వారా అమెజాన్ ఈ ఏడాది ఐదు ఎమ్మీ అవార్డులు దక్కించుకున్న విషయం తెల్సిందే. ఇక ఆస్కార్ అవార్డుల విషయంలో తన పోటీదారు ‘నెట్‌ఫిక్స్’కన్నా ముందుంటారా, లేదా ? అన్నది కాలమే చెప్పాలి. ఎందుకంటే, నెట్‌ఫిక్స్ తీసిన ‘బీస్ట్స్ ఆఫ్ నో నేషన్’ ఇప్పటికీ ఆస్కార్ బరిలో పోటీ పడుతున్నది.


సినిమా డీవీడీల కోసం, ఆన్‌లైన్ రిలీజ్ కోసం మూడు నెలలపాటు నిరీక్షించాల్సిన అవసరం లేకుండా తాము తీసిన సినిమాలను వెంటనే ఆన్‌లైన్‌లో పెడతామని జర్మనీ పత్రిక ‘డై వెల్ట్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెఫ్ వెల్లడించారు. గతేడాది నెట్‌ఫిక్స్‌కు ఎమ్మీ అవార్డుల్లో 31 నామినేషన్లు లభించగా, అమెజాన్‌కు ఒక్క నామినేషన్ కూడా లభించలేదు. అయితే ఈ ఏడాది అలాకాకుండా 12 నామినేషన్లు సాధించి ఐదు అవార్డులు గెలుచుకొంది. నెట్‌ఫిక్స్ 34 నామినేషన్లు సాధించినప్పటికీ నాలుగు అవార్డులు మాత్రమే దక్కించుకొంది.

1994లో స్థాపించిన అమెజాన్ తొలుత ఆన్‌లైన్‌లో పుస్తకాల విక్రయం ద్వారా వ్యాపార రంగంలోకి ప్రవేశించింది. అనతికాలంలోనే ఈ-పుస్తకాల ద్వారా తన పాపులారిటీని పెంచుకొంది. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా కొద్దికాలంలోనే తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకొంది. ప్రాపర్టీలో పెట్టుబడులు పెట్టిన అమెజాన్ ‘వాషింఘ్టన్ పోస్ట్’ మీడియా సంస్థలో కూడా పెట్టుబడులు పెట్టింది.

 

ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ బ్రాడ్ క్యాస్టింగ్ హక్కులను కొనే అంశాన్ని కూడా పరిశీస్తోంది. డ్రోన్ల ద్వారా ప్యాకేజీలను డెలివరీ చేయాలని నిర్ణయించినట్టుగా ఇదివరకే ప్రకటించిన విషయం తెల్సిందే. డ్రోన్ల కోసం శాటిలైట్ నావిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్‌ను కూడా ఉపయేగిస్తామని కూడా జెఫ్ తెలిపారు. అయితే ఏవియేషన్ అథారిటీ అనుమతి ఇంకా లభించాల్సి ఉంది.  ఆన్‌లైన్ వ్యాపారంలో ప్రపంచంలోనే ఆరవ స్థానాన్ని ఆక్రమించిన అమెజాన్ ఏడాది రెవెన్యూ 60 లక్షల కోట్ల రూపాయలు.

>
మరిన్ని వార్తలు