తండ్రిని తలచుకొని భావోద్వేగానికి గురైన జెఫ్‌ బేజోస్‌

18 May, 2019 14:00 IST|Sakshi

వాషింగ్టన్‌ : 16వ ఏట మా నాన్న క్యూబా నుంచి వలసవచ్చారు. అప్పుడు ఆయనకు ఇంగ్లీష్‌ కూడా రాదు. కానీ ఇవేవి తన అమెరికా కల నుంచి ఆయనను దూరం చేయలేకపోయాయి అన్నారు అమెజాన్‌ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుడు జెఫ్‌ బేజోస్‌. స్టాట్యూ ఆఫ్‌ లిబర్టి మ్యూజియం ప్రారంభోత్సవం సందర్భంగా.. తన తండ్రి అమెరికా ప్రస్థానాన్ని గుర్తు చేసుకుని ఉద్వేగానికి గురయ్యారు జెఫ్‌ బేజోస్‌.

ఈ సందర్భంగా ఆయన ‘16వ ఏట నా తండ్రి క్యూబా నుంచి అమెరికా వలస వచ్చారు. అప్పుడు ఆయనకు స్పానిష్‌ తప్ప మరో భాష తెలీదు. కానీ ఇవేవి ఆయనను అమెరికా కల నుంచి దూరం చేయలేకపోయాయి. సంకల్పం, దీక్ష, ఆశావాద దృక్పథం ఆయనను నిరంతరం తన గమ్యం వైపు నడిపించేవి. అవే నాకు ఆదర్శం. కష్టకాలంలో ప్రజలు ఒకరికి ఒకరు బాసటగా ఎలా నిలుస్తారనే అంశాన్ని నా తండ్రి అమెరికా ప్రయాణం చూస్తే అర్థం అవుతుంది. స్టాట్యూ ఆఫ్‌ లిబర్టి కొత్త మ్యూజియం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ప్రయాణాన్ని మరోసారి గుర్తు తెచ్చుకునే అవకాశం లభించింది. ఇది తన చరిత్ర’ అంటూ జెఫ్‌ ట్వీట్‌ చేశారు.

జెఫ్‌ బేజోస్‌ తండ్రి మైక్‌ బేజోస్‌ తన 16వ ఏట క్యూబా నుంచి వలస వచ్చారు. ఇదిలా ఉంటే మైక్‌ బేజోస్‌, జెఫ్‌ సొంత తండ్రి కాదు. జెఫ్‌ నాలుగేళ్ల వయసులో అతని తల్లి జాక్లిన్‌ గిసే మైక్‌ బేజోస్‌ను వివాహమాడారు. మారు తండ్రి అయినప్పటికి మైక్‌ తనను చాలా ప్రేమగా పెంచాడంటారు జెఫ్‌.

మరిన్ని వార్తలు