అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ రికార్డు

2 Jul, 2020 11:01 IST|Sakshi
అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్(ఫైల్ ఫోటో)

171.6 బిలియన్ డాలర్ల రికార్డు సంపద

తన రికార్డు తనే బ్రేక్ చేసిన అమెజాన్ సీఈఓ

ప్రపంచ రెండవ సంపన్న మహిళగా మెకంజీ 

అమెజాన్ ఫౌండర్, సీఈఓ జెఫ్ బెజోస్ సంపదలో మరోసారి రికార్డు సాధించారు. గత సంవత్సరం మెకెంజీతో విడాకుల పరిష్కారంలో భాగంగా అమెజాన్ లో తన వాటాలో నాలుగింట ఒక వంతును వదులుకున్న తర్వాత కూడా  బెజోస్ సంపద  172  బిలియన్ డాలర్ల  వద్ద మళ్లీ  తారాస్థాయిని తాకింది.    
 
అమెజాన్ షేర్లు బుధవారం 4.4 శాతం పెరిగి రికార్డు స్థాయి 2,879 డాలర్లకు చేరింది. దీంతో ప్రపంచ కుబేరుడి బెజోస్ ఆదాయం 171.6 బిలియన్ డాలర్లకు పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, సెప్టెంబర్ 4, 2018 నాటికి బెజోస్ సంపద 167.7 బిలియన్ డాలర్ల వద్ద రికార్డు స్థాయిని తాకింది. తాజాగా తన రికార్డును తనే బ్రేక్ చేశారు. కరోనా మహమ్మారి, మహామాంద్యం పరిస్థితులున్న ఈ ఏడాదిలోనే 56.7 బిలియన్లను ఆర్జించడం విశేషం. కరోనా సంక్షోభ సమయంలో ముందుండి పనిచేస్తున్న ఉద్యోగులకు వన్ టైం బోనస్ కింద 500 మిలియన్ డాలర్లు చెల్లించనున్నట్టు గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వ్యవస్థాపకుడి రికార్డు సంపదపై వ్యాఖ్యానించడానికి  అమెజాన్ నిరాకరించింది.

మరోవైపు విడాకుల తర్వాత అమెజాన్‌లో 4 వాతం వాటాను సొంతం చేసుకున్న జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకంజీ సంపద నికర విలువ 56.9 బిలియన్ డాలర్లు పెరిగింది. తద్వారా బ్లూమ్‌బెర్గ్ ర్యాంకింగ్‌లో 12వ స్థానాన్ని సాధించారు. అంతేకాదు  ప్రపంచంలో రెండవ సంపన్న మహిళగా నిలిచారు.  లోరియల్ కు చెందిన  ఫ్రాంకోయిస్ బెటెన్  కోర్ట్  మేయర్స్ మొదటి మహిళగా ఉన్నారు.

మిగిలిన బిలియనీర్లలో ఎక్కువ మంది టెక్ రంగానికి చెందినవారున్నారు. వీరిలో టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ సంపద జనవరి 1 నుండి 25.8 బిలియన్ డాలర్లు పెరిగింది. జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు ఎరిక్ యువాన్ సంపద దాదాపు నాలుగు రెట్లు పెరిగి 13.1 బిలియన్ డాలర్లుకు చేరింది.

కాగా కరోనా కాలంలో ప్రపంచ కుబేరుల సంపద స్వల్పంగా పెరిగింది. మరికొంత మంది భారీగా నష్టపోయారు. స్పెయిన్ కు చెందిన అమాన్సియో ఒర్టెగా 19.2 బిలియన్ డాలర్లను కోల్పోగా, బెర్క్‌షైర్ హాత్వే సంస్థ చైర్మన్ వారెన్ బఫ్ఫెట్ 19 బిలియన్ డాలర్లు, ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ 17.6 బిలియన్ డాలర్లు  సంపదను పోగొట్టుకున్నారు. 500 మంది ధనవంతుల మొత్తం సంపద ఈ సంవత్సరం ప్రారంభంలో 5.91 ట్రిలియన్ల డాలర్లతో పోలిస్తే స్పల్పంగా పుంజుకుని  5.93 ట్రిలియన్ డాలర్లకు చేరింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు