జెల్లీ ఫిష్ లాడ్జి గదులు!

17 Oct, 2016 02:23 IST|Sakshi
జెల్లీ ఫిష్ లాడ్జి గదులు!

ఒక్కదెబ్బకు నాలుగు పిట్టలంటే ఇదేనేమో... ఫొటోలు చూశారా? అందులో నీటిపై తేలియాడుతూ కనిపిస్తున్నవి ఏమనుకుంటున్నారు? ఇవి.. లాడ్జీ రూములు. అంతే కాదు, గాలీ, నీరు క్లీన్ చేసే యంత్రాలు కూడా. ప్లస్ ఆకు కూరలు, కాయగూరలు పండించే పొలాలు! అదెలా సాధ్యం అని ఆశ్చర్యపోవద్దు. అన్నింటి కంటే ముందుగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈ బుడగలు నదుల్లో, కాలువల్లో లాడ్జీ రూముల్లా పనిచేస్తాయి. పైభాగంలో ఉన్న వస్త్రంలో సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. ఇవి విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. అడుగున నీట్లో దారపు పోగుల్లా వేలాడుతూ ఉండే నిర్మాణాలు     కొట్టుకుపోయే చెత్తను ఒడిసిపడతాయి. అంతేకాకుండా ఈ పోగుల్లోనే నీటిలోని కాలుష్యాలను లెక్కకట్టే సెన్సర్లు వగైరాలను ఏర్పాటు చేశారు. ఒకవేళ కాలుష్యాలు ఎక్కువగా ఉంటే పైన ఉన్న చిన్న చిన్న గుండ్రటి నిర్మాణాల ద్వారా రకరకాల బ్యాక్టీరియాతో శుద్ధి చేస్తారు. ఆ తరువాత వదిలేస్తారు. లేదంటే బుడగలోపల పంటలకు ఉపయోగిస్తారు.

జానైన్ హంగ్ అనే డిజైనర్ చేతిలో రూపుదిద్దుకున్నాయి ఇవి. లాడ్జీల నిర్వహణతో పరిసరాల్లోని ప్రజలకు అదనపు ఆదాయం లభిస్తుందని, గాలి, నీరు శుద్ధి చేయడం, కాయగూరలు, ఆకు కూరలు పండించడం అదనపు ప్రయోజనాలని అంటున్నారు హంగ్. ప్రస్తుతానికి వీటిని వాస్తవరూపంలో ఏర్పాటు చేసే ఆలోచనలేవీ లేకపోయినప్పటికీ భవిష్యత్తులో కాలుష్యం మరింత ఎక్కువైతే.. రసాయనాల వాడకంపై మరింత కఠినమైన నియంత్రణలు అమల్లోకి వస్తే ఇలాంటి సహజ సిద్దమైన ఏర్పాట్లకు ప్రాముఖ్యత లభించవచ్చు. జనావాసాలను ప్రకృతి స్ఫూర్తితో నిర్మించడం అన్న అంశంపై ఇన్‌హ్యాబిటాట్ వెబ్‌సైట్ ఏర్పాటు చేసిన ఒక పోటీకి హంగ్ ఈ జెల్లీఫిష్ లాడ్జీ డిజైన్‌ను పంపించారు. ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది.

మరిన్ని వార్తలు