తొలిసారి జీసస్ సమాధి తెరిచారు

29 Oct, 2016 08:32 IST|Sakshi
తొలిసారి జీసస్ సమాధి తెరిచారు

జెరూసలెం: చరిత్రలో తొలిసారి ఏసుక్రీస్తు సమాధిని తెరిచారు. ఆయన సమాధిపై మూసి ఉంచిన చలువరాయిని తొలగించారు. ఈ సమాధి చుట్టూ నిర్మించిన చర్చిని పునరుద్ధరించే చర్యల్లో భాగంగా సమాధిపై ఉన్న రాయిని పలువురు చర్చి మతపెద్దల సమక్షంలో పరిశోధకులు అతి జాగ్రత్తగా తొలగించారు. క్రీస్తును సమాధి చేసిన తర్వాత క్రీ.శ.1555 నుంచి ఈ పవిత్ర చలువరాతిని ఏనాడు కదిలించలేదు. అయితే, తాజాగా చర్చిని పునరుద్ధరించే భారీ ప్రాజెక్టు పనుల్లో భాగంగా పరిశోధకులు తొలిసారి దీనిని తెరిచారు.

ఈ సందర్భంగా ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఫ్రెడ్రిక్ హైబర్ట్ మాట్లాడుతూ 'క్రీస్తును ఉంచి సమాధి పైభాగాన్ని కప్పి ఉంచిన చలువరాతిని బయటకు తీశాం. దాని కింద ఉన్న వస్తువులు చూసి మేం చాలా ఆశ్చర్యపోయాం' అని చెప్పారు. 'చాలా సుదీర్ఘకాలంగా జరిగిన విశ్లేషణ అనంతరం క్రీస్తు సమాధిపై ఉంచిన అసలైన చలువరాయిని ఎట్టకేలకు ఇప్పుడు అందరం ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం. దీని కిందే క్రీస్తును ఉంచారు' అని కూడా ఆయన తెలిపారు. క్రీస్తును సమాధి చేసిన ఈ ప్రాంతంలో పెద్ద చర్చిని నిర్మించగా దాని మధ్యలో సమాధి చుట్టూ ఒక చిన్న నిర్మాణం ఉంది. దీనిని ఎడిక్యుల్ అంటారు. అతి సుందరంగా నిర్మించిన ఇందులో ఒకసారి అగ్ని ప్రమాదం సంభవించడంతో 1808, 1810 మధ్య పునరుద్ధరించారు. ఆ సమయంలో నేషనల్ టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ ఏథెన్స్ పరిశోధకులు ఆ పనులు పూర్తి చేశారు. కాగా, తాజాగా మరోసారి పునరుద్ధరించనున్నారు.

మరిన్ని వార్తలు